Share News

పది సెకన్లలో చంపేశాడు..!!

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:52 AM

నిజామాబాద్‌లో యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబుపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. వైష్ణవి సోదరుడు సంతోష్‌ తానే ఈ దాడికి పాల్పడ్డానంటూ వీడియో విడుదల చేసి అనంతరం కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

పది సెకన్లలో చంపేశాడు..!!
Haribabu

  • నిజామాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య

  • యూట్యూబర్‌ వైష్ణవి భర్తను చంపిన దుండగుడు

  • కారులోంచి దిగి కత్తితో కిరాతకంగా చంపి పరారీ

  • నా చెల్లిని చంపిన వాడిని హతమార్చానంటూ వైష్ణవి సోదరుడి వీడియో

  • జగిత్యాల జిల్లా కోరుట్ల ఠాణాలో లొంగుబాటు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. జగిత్యాలకు చెందిన యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిత్తరి హరిబాబు(26) హత్యకు గురయ్యాడు. ఓ కారులో నుంచి దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. రహదారి పక్కన ఉన్న హరిబాబుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చి పరారయ్యాడు. కేవలం పది సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరగడం గమనార్హం. అయితే, ఈ హత్య తానే చేశానంటూ వీడియో విడుదల చేసిన వైష్ణవి సోదరుడు సంతోష్‌.. కాసేపటి తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


జగిత్యాల జిల్లా కోరుట్లలోని మాదాపూర్‌కి చెందిన చిత్తరి హరిబాబు(26), యూట్యూబర్‌ అయిన వైష్ణవి(20) ప్రేమించుకొని గతేడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 17న వైష్ణవి హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన హరిబాబే ఆమెను హత్య చేసినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. వైష్ణవికి 12 మంది సోదరులు (పెదనాన్న, బాబాయిల కుమారులు) ఉండగా.. తమ సోదరిని హతమార్చిన హరిబాబును చంపేస్తామని వారు అప్పట్లో బహిరంగంగా చెప్పారు. అయితే, వైష్ణవి హత్య కేసులో అరెస్టయిన హరిబాబు నెల రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ప్రాణ భయంతో తన తల్లి లక్ష్మితో కలిసి జగిత్యాల నుంచి నిజామాబాద్‌కు మకాం మార్చాడు.


నిజామాబాద్‌ ఆర్‌ఆర్‌ చౌరస్తాలో మొక్కజొన్న కండెలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆర్‌ఆర్‌ చౌరస్తాలోని ఓ పానీపూరి బండి వద్ద హరిబాబు బాటిల్‌లో నీళ్లు నింపుకుంటున్నాడు. అదే సమయంలో రోడ్డుకి మరో వైపు ఆగిన ఓ కారులో నుంచి దిగిన గుర్తు తెలియని వ్యక్తి.. వేగంగా వచ్చి కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో హరిబాబు తల, మెడపై విచక్షణారహితంగా నరికి తిరిగి కారులో వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రక్తపుమడుగులో పడి ఉన్న హరిబాబును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు.


సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, హరిబాబును చంపేస్తామని వైష్ణవి సోదరులు చేసిన హెచ్చరికలు, వైష్ణవి మార్చి 17న మృతి చెందగా.. హరిబాబు సెప్టెంబరు 17న హత్యకు గురికావడం తదితర విషయాల వల్ల హరిబాబు హత్యలో వైష్ణవి సోదరుల పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన చెల్లిని చంపిన హరిబాబును తానే చంపేశానని, పోలీసులకు లొంగిపోతున్నానని వైష్ణవి సోదరుడు సంతోష్‌ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనంతరం గురువారం రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని నిజామాబాద్‌ జిల్లా పోలీసులకు అప్పగించారు. కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

హైదరాబాద్‌లో హార్వర్డ్‌ కోర్సులు
ఆపరేషన్‌ పోలో.. ఒక అద్భుతం

Updated Date - Sep 18 , 2026 | 05:54 AM