హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:24 AM
హైదరాబాద్‌లో డిసెంబరు నుంచి హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలతో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
డిసెంబరు నుంచి ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులోకి..
ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్‌ను తీర్చిదిద్దుతున్నాం
యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వచ్చే డిసెంబరు నుంచి హైదరాబాద్‌లోని ఔత్సాహికులకు.. హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. గురువారం ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సమావేశమయ్యారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈవో ఫ్లోరా హామిల్టన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, యూకేకు చెందిన వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణ విద్యా వ్యవస్థ, పరిశ్రమలు, భవిష్యత్తు పెట్టుబడులపై సీఎం ఈ సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లూ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సిటీలు హైదరాబాద్‌లో ఆఫ్ షోర్ క్యాంప్‌సలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్టు చెప్పారు. యూకే బిజినెస్ స్కూల్స్ తెలంగాణలో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సంస్థలు రాష్ట్రం వైపు చూస్తాయని.. అదే సమయంలో ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యార్థుల్లో విదేశీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్థి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్‌ను తీర్చిదిద్దుతున్నామని.. దాంతో భావితరాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డిసెంబరులో అక్కడ నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’కు రావాలంటూ యూకే బృందానికి ఆహ్వానం పలికారు. ప్రపంచస్థాయి వర్సిటీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
గోదావరి-కావేరి అనుసంధానానికి మార్గం సుగమం
టార్గెట్ ఫాంహౌస్!