Share News

కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ జరగాల్సిందే..

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:06 AM

కేసీఆర్‌ కుటుంబానికి చెందిన భూములపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి కేసీఆర్‌ ఫౌంహౌస్ లోని ప్రభుత్వ భూమిని అక్కడ డప్పు కొట్టిన ప్రతి దళితుడికి పంచాల్సిందేనని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ జరగాల్సిందే..
TPCC CHIEF

అన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ కుటుంబానికి చెందిన భూములపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి కేసీఆర్‌ ఫౌంహౌస్ లోని ప్రభుత్వ భూమిని అక్కడ డప్పు కొట్టిన ప్రతి దళితుడికి పంచాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. 2004, 2009లో కేసీఆర్‌కు వ్యవసాయ భూములే లేవని, అలాంటిది 2026 నాటికి 67 ఎకరాల భూములు కేసీఆర్‌కు, ఆయన భార్యకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2010లో దేవరయాంజల్‌లో ఒక ఎకరం భూమి మాత్రమే ఉందని ప్రకటించిన కేటీఆర్‌.. 2026 నాటికి కేటీఆర్‌కు, ఆయన భార్య శైలిమ, కుమార్తె, కుమారుడుకి 123 ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాలు చేసిన వారు సర్వం కోల్పోతే.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం భూములను కొల్లగొట్టిందని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో మహేశ్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ చెప్పే నీతి కథల్లో నీతి ఎంత ఉందో వాళ్లు సమర్పించిన అఫిడవిట్‌లే స్పష్టం చేస్తాయని, వాళ్ల అఫిడవిట్‌లే భూఅక్రమాలను, అవకతవకలను బహిర్గతం చేస్తాయన్నారు. కొండా సురేఖ పార్టీలో కొనసాగుతానని ప్రకటించడం శుభపరిణామన్నారు. కొండా సురేఖ ముక్కు సూటి మనిషి అని, ఆమె ప్రొఫైల్‌ చిన్నది కాదని చెప్పారు. దసరాలోపు ఖాళీగా ఉన్న డీసీసీలతో పాటు రెండు, మూడు డీసీసీల మార్పు ఉంటుందని.. నామినేటెడ్‌, కార్పొరేషన్‌ పదవుల భర్తీ పూర్తవుతుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలోనిదని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. మంత్రి పదవిని తాను అడగలేదని, ఇచ్చేవాళ్లు కూడా తనను అడగలేదని బదులిచ్చారు. ఒకవేళ ఆ అవకాశం వస్తే మంత్రి పదవి తీసుకోవాలా? వద్దా? అప్పుడు ఆలోచిస్తానని.. అసలు మంత్రి పదవి కంటే పీసీసీ పదవే పెద్దదని వ్యాఖ్యానించారు.


బీఆర్‌ఎస్‌ గుర్తింపునూ రద్దు చేయాలి..

అసెంబ్లీ స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన అంశంలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాలతో పాటు ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ నేతలు పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ ఫిర్యాదు చేశారు. ఘటన చోటుచేసుకున్న రోజు నాటి ఫొటోలు, వీడియోలు ఇతర సాక్ష్యాలను సమర్పించామని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు వారు మీడియాకు వెల్లడించారు.

Updated Date - Sep 18 , 2026 | 05:09 AM