Share News

ఆపరేషన్‌ పోలో.. ఒక అద్భుతం

ABN , Publish Date - Sep 18 , 2026 | 05:44 AM

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ పోలోను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ గుర్తుచేశారు. హైదరాబాద్‌ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలు చిరస్మరణీయమని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు.

ఆపరేషన్‌ పోలో.. ఒక అద్భుతం
C P Radhakrishnan

  • హైదరాబాద్‌ విమోచన పోరాటం.. ప్రజా ఉద్యమం

  • విమోచన దినోత్సవ వేడుకలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌

  • విమోచన వీరుల త్యాగాలు చిరస్మరణీయం: గవర్నర్‌ శుక్లా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ పోలో’ ఒక అద్భుతమని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో పలు సంస్థానాలు ఆనాడు భారత్‌లో విలీనమయ్యాయని, హైదరాబాద్‌ సంస్థానం విలీనానికి నిజాం రాజు నిరాకరించడంతో ‘ఆపరేషన్‌ పోలో’ పేరిట సైనిక చర్య చేపట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక వేడుకలకు రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్దార్‌ పటేల్‌ విగ్రహానికి, వార్‌ మెమోరియల్‌ స్థూపం వద్ద యుద్ధ వీరులకు నివాళులర్పించారు. కేంద్ర సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.


అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘రాంజీ గోండు, కుమ్రంభీం, తుర్రేబాజ్‌ఖాన్‌ వంటి వారి త్యాగాల వల్లే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాద్‌ విమోచనం కోసం పోరాడిన వీరులను స్మరించుకునేందుకు 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ విమోచన పోరాటం ఒక ప్రజా ఉద్యమం.. విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, రైతులు, సామాన్య పౌరులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు లేదా ప్రముఖ వ్యక్తులు మాత్రమే చరిత్రను లిఖించరు.. సామాన్యుల త్యాగాలు కూడా చరిత్రను నిర్మిస్తాయ’న్నారు.


అసాధ్యమనుకున్న హైదరాబాద్‌ సంస్థాన విలీనాన్ని సర్దార్‌ పటేల్‌ సుసాధ్యం చేశారని కొనియాడారు. ‘రాజకీయ విలీనం భూభాగాలను ఏకం చేస్తే రాజ్యాంగ ప్రజాస్వామ్యం ప్రజలను ఏకం చేస్తుంది. ప్రతి భారతీయుడికీ సమాన హక్కులు, సమాన గౌరవం, సమాన అవకాశాలు లభించినప్పుడే జాతీయ ఐక్యత మరింత బలపడుతుంద’న్నారు. భారత్‌ ఎప్పటికీ ఒక్కటేనని, దేశ ప్రజలు ఐక్యంగా ముందుకు సాగడమే సర్దార్‌ పటేల్‌కు నిజమైన నివాళి’ అని చెప్పారు. ‘నక్సల్‌రహిత భారత్‌.. ప్రధాని మోదీ లక్ష్యమని, ఇందులో కేంద్ర బలగాల పాత్ర ప్రశంసనీయమన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతమైందని పేర్కొన్నారు. విమోచన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.


‘హైదరాబాద్‌ విమోచన దినం కేవలం చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకునే రోజే కాదు.. ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పట్ల మన నిబద్ధతను చాటే రోజు కూడా’ అని పేర్కొన్నారు. విమోచన వీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని శక్తిమంతమైన, సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం ఉందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో ఒక పవిత్రమైన సామూహిక వాగ్దానం చేశాం. సెప్టెంబరు 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. గత పా లకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చారిత్రక అధ్యాయాన్ని పక్కనబెట్టార’ని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు.


నిజాం మంచివాడైతే కొమ్రంభీం, ఐలమ్మ ఎందుకు తిరుగుబాటు చేశారు?: కిషన్‌రెడ్డి

నిజాం మంచివాడైతే కొమ్రంభీం, చాకలి ఐలమ్మ, వందేమాతరం రాంచందర్‌రావు, భాగ్యరెడ్డి వర్మ, దొడ్డి కొమురయ్య, వంటి వారు ఎందుకు తిరుగుబాటు చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌ రెడ్డి... సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. రజాకార్ల కిరాతకాల నుంచి రక్షణ కోసం పల్లెల్లో బురుజులు ఎందుకు కట్టుకున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా నిజాంను కీర్తించిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఓటు బ్యాంకు దాహంతో, మజ్లిస్‌ పార్టీకి కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు సాగిలపడ్డాయి. నిజాం నిరంకుశత్వాన్ని గొప్ప పాలనగా చిత్రీకరిస్తున్నాయ’ని విమర్శించారు.


ఈ వార్తలనూ చదవండి:

హైదరాబాద్‌లో హార్వర్డ్‌ కోర్సులు
పోరాటాల స్ఫూర్తితోఆధునిక తెలంగాణ

Updated Date - Sep 18 , 2026 | 05:44 AM