పోరాటాల స్ఫూర్తితోఆధునిక తెలంగాణ
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:33 AM
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రైతులు, మహిళలు, పేదలు, బీసీలు, విద్యార్థులు, వైద్య రంగానికి చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించారు.
ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయమే ప్రజాపాలనకు పునాదులు
సెప్టెంబరు 17 అంటే గతమే కాదు..
బాధ్యత కూడా గుర్తు చేసే రోజు
ప్రజాపాలన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం జరిపిన పోరాటాల చరిత్రను మరువబోమని.. ఆ పోరాటాల స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, హక్కులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమేనని తెలిపారు. గురువారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు.
అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూమి-భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ప్రజలు అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికమని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం అధికమని తెలిపారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు.
అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు
రైతు సంక్షేమానికి రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. భూభారతి చట్టంతో భూ పరిపాలనలో సంస్కరణలు, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని..5.94 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్స్ జారీ చేశామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, ఎస్‌ఎల్‌బీసీ తదితర ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ.31వేల కోట్లు అందించామని చెప్పారు. మరో 2.25లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను శాస్ర్తీయంగా నిర్వహించి, దాని ఆధారంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లు చెప్పారు. ఫిబ్రవరి 4ను తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, సీఎం సహాయనిధి ద్వారా 5.19 లక్షల మందికి రూ.2,526 కోట్ల సాయం అందించినట్లు వివరించారు.
పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. సనత్‌నగర్‌లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ని ప్రారంభించామని.. అల్వాల్, ఎల్‌బీనగర్ టిమ్స్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు పంపామని సీఎం తెలిపారు.
డిసెంబరులో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో టీసీఎస్ రూ.70వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్, అమె జాన్ రూ.లక్ష కోట్లతో డేటా సెంటర్ నిర్మాణం చేపడుతున్నాయని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్లు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చనున్నాయన్నారు. సెప్టెంబరు 17 గతాన్ని గుర్తు చేసే రోజే కాదని.. బాధ్యతనూ గుర్తు చేసే రోజు అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు
టార్గెట్ ఫాంహౌస్!