Share News

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్..

ABN , Publish Date - Oct 09 , 2026 | 08:42 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఆటపాటల సాంస్కృతిక వైభవమే బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్..
Former CM KCR

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఆటపాటల సాంస్కృతిక వైభవమే బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని సంప్రదాయ పండుగలన్నింటిలో ప్రత్యేకమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి అద్దం పడుతూ ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.


తొమ్మిది రోజుల పాటు సందడి

ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. ఆడపడుచులు కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి ఒకచోట చేరి ఆటపాటలతో పండుగను ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతిని పూజిస్తూ, తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.


బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదా

బతుకమ్మకు తెలంగాణ తొలి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో పాటు, ఆడబిడ్డలకు కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేసీఆర్ గుర్తుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్.. 12న మంత్రులతో కీలక భేటీ

తెలంగాణలో రెవెన్యూ అధికారుల బదిలీలు.. జీవో 630 విడుదల చేసిన సర్కార్

Updated Date - Oct 09 , 2026 | 09:17 PM