Share News

ఉపగ్రహాన్ని కాదు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:20 AM

బీఆర్‌ఎస్‌ నుంచి ఓట్లు చీల్చాలనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం.....

ఉపగ్రహాన్ని కాదు

  • మరొకరి వెలుగులో ప్రకాశించను

  • నాది స్వతంత్ర జెండా

  • పెద్ద లక్ష్యంతో పార్టీ.. మే మొదటి వారంలో ప్రకటన

  • సిసోడియాకు ఆప్‌ మద్దతిచ్చినట్లు.. బీఆర్‌ఎస్‌ నాకు ఇవ్వలేదు

  • కేసీఆర్‌, కేటీఆర్‌ సహా పెద్ద నేతలెవరూ మాట్లాడలేదు

  • ఆ నేతలకు, ఆ పార్టీకి కోర్టు తీర్పు చెంపపెట్టు

  • నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్‌ఎస్‌ విఫలం

  • కాంగ్రెస్‌దీ అదే బాట.. మూడేళ్లలో ఎవరేంటో ప్రజలే తేల్చేస్తారు

  • ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి అధ్యక్షురాలు కవిత

  • ‘‘మద్యం కుంభకోణంలో నాపై ఆరోపణలు, కేసు పెడుతున్నారన్న విషయాలపై తొలిసారి ‘ఆంధ్రజ్యోతి’లోనే వార్త వచ్చింది. ఆ రోజే నేను కేసీఆర్‌ దగ్గరకు వెళ్లాను. ఇది కరెక్టేనా? అని ఆయన అడిగారు. నేను కాదని చెప్పాను. అయితే ఇదే విషయాన్ని మీడియాతో చెప్పమన్నారు. ఆయననే చెప్పమని అడిగితే.. ఫర్వాలేదు బలంగా చెప్పు, ధైర్యంగా ఉండు అన్నారు. అప్పుడే కాదు.. ఆ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌లో పెద్ద నాయకులు నాకు అండగా మాట్లాడలేదు. ఎవరూ ఖండించలేదు. తప్పు చేశానేమో అనే భావన ప్రజల్లో కల్పించారు. అలాంటి వ్యక్తులు, పార్టీలకు కోర్టు తీర్పు చెంపపెట్టు’’

- కవిత

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నుంచి ఓట్లు చీల్చాలనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం, మానవత్వం ప్రధాన ప్రాతిపదికలుగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. మే మొదటి వారంలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాం నీళ్లు-నిధులు, నియామకాల నినాదాలను సాకారం చేయడంలో విఫలమైందని, మాటలు చెప్పి, హామీల మూటలిచ్చి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పాత కథలు చెప్పడం తప్ప కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎ్‌సగా మారాక.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మూడూ జాతీయ పార్టీలేని, వాటికి వంద అంశాల్లో తెలంగాణ ఒక అంశంగా మాత్రమే ఉంటుదని అన్నారు. అందుకే తెలంగాణ ఫస్ట్‌ అంటూ.. మూడు పార్టీల నుంచి ఓట్లను చీల్చే కొత్త పార్టీగా అవతరిస్తామని తెలిపారు. తనకు ఎవరి మద్దతు లేదని, ఎవరో మద్దతిస్తే ఉపగ్రహంలా వెలుగుదామనుకుంటే ఎక్కువకాలం నడవదని అన్నారు. ప్రజల కోసం, సమాజం కోసం, మంచి మార్పు కోసం నిలబడతానని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో వివాదాలు, సంచలన అంశాలకు కేంద్ర బిందువుగా ఉన్న కవిత మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్వూ ఇచ్చారు.


మద్యం ఆరోపణలు, జైలు జీవితం, చివరకు కోర్టు తీర్పుతో ఉపశమనం.. ఈ ప్రస్థానం ఎలా అనిపించింది?

సత్యమేవ జయతే. నిజం నిప్పులాంటిది. నాలుగేళ్లు నింద మోయాల్సి వచ్చింది. ఇప్పుడు ఉపశమనం. కానీ, ఆ నాలుగేళ్లలో నాతోపాటు అమ్మా, నాన్న, అత్తా, మామ, భర్త, పిల్లలు పడ్డ బాధ దారుణం. ప్రాంతీయ పార్టీల పట్ల ఇలాంటి పక్షపాత వైఖరి ఘోరం. కోర్టు తీర్పు చాలా సంతోషం కలిగించింది.

ఈ నాలుగేళ్లలో అత్యంత బాధపడ్డ సందర్భాలేంటి?

నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లిన మొదటి రోజే బీపీ బాగా పెరిగింది. 180పైకి చేరింది. ఇంజక్షన్లు చేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా చిన్నకొడుక్కి ఇంటర్‌ పరీక్షలు. ఓవైపు పరీక్షల టెన్షన్‌.. అంతలోనే అమ్మను అరెస్టు చేశారన్న టెన్షన్‌. ఇక జైల్లో ఉన్నప్పుడు మొదటి 15 రోజులు ప్రత్యక్ష నరకం. ఆ వాతావరణం చాలా ఘోరం. 15కిలోల బరువు తగ్గిపోయా. బయటికొచ్చాక కూడా కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. తిహాడ్‌ జైల్లో నాకంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవారున్నారు. ఆ అనుభవంతోనే జైలు విధానాల్లోనే సంస్కరణలు తేవాల్సి ఉందని నిర్ణయించుకున్నా.


సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పుడల్లా కేటీఆర్‌, హరీశ్‌ ఢిల్లీకి వచ్చారు కదా!గ్యాప్‌ ఎక్కడ వచ్చింది?

నాపై మొదట మద్యం అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. నీది నువ్వే ఖండించుకో అన్నారు. మొదటిసారి కదా! అని ఖండిస్తూ మాట్లాడాను. ఇది 2022 మే నెలలో జరిగింది. ఆ తర్వాత 2024 మార్చిలో నన్ను అరెస్టు చేశారు. ఆ రెండేళ్లలో ఎక్కడా పార్టీ నాకు అండగా లేదు. అరెస్టయినప్పుడు పార్టీ వచ్చింది. పార్టీలో ఎవరిపై అయినా ఇదే వైఖరి అన్నారు. నాకది నచ్చలేదు. మీకే నమ్మకం లేకుంటే సమాజం ఎలా నమ్ముతుంది? సిసోడియాపై ఆరోపణలు వస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ అతనికి మద్దతుగా నిలిచింది. బీఆర్‌ఎస్‌కు పెద్ద సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ ఉంది. కానీ, నాకు మాత్రం అది మద్దతుగా రాలేదు.

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కావాలనే ప్రతిపాదన వచ్చిందని, మీరు వ్యతిరేకించారని ప్రచారం?

నిజమే. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెచ్చారు. నా దగ్గరకు పెద్ద నాయకులే తెచ్చారు. నేను వ్యతిరేకించాను. పార్టీకి లక్షల మంది కార్యకర్తలున్నారు. నా కోసం పార్టీని విలీనం చేయొద్దు. చిరంజీవి పార్టీ పెట్టి తీసేసినప్పుడు ఎంతమంది బాధపడ్డారో చూశా. ఇప్పుడు అలా చేస్తే నమ్ముకున్న లక్షల మంది హర్ట్‌ అవుతారు. వారి రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయి. నా కేసు విషయంలో లీగల్‌గా పనిచేయండి.. పోరాడదాం అని చెప్పా. కానీ, బీఆర్‌ఎ్‌స-బీజేపీ మైత్రి ఇప్పటికీ అలాగే ఉంది. మొన్న మునిసిపల్‌ ఎన్నికల్లో చాలాచోట్ల కలిసే పోటీ చేశారు. ఎంపీ రఘునందన్‌రావు కావాలని బీఆర్‌ఎ్‌సకు ఓటేశారు.

మీ బెయిల్‌ కోసం పార్టీనే విలీనం చేస్తామన్నారంటే.. మీకు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతిచ్చినట్లే కదా?

మీరు ఇక్కడే విషయాలు గ్రహించాలి. ప్రజలకు చెప్పాలి. నాపై కేసు పెట్టిన నాటినుంచి నేను జైలుకెళ్లే వరకు ఉన్న రెండేళ్ల పైబడి సమయంలో ప్రజల కోర్టులో నన్ను ఎంత అవహేళనకు, మానసిక క్షోభకు గురిచేశారు...ఎంత అవమానపరిచారు. తప్పు చేస్తే అరెస్టు చేశారన్న భావన మీరే కల్పించి.. మళ్లీ మీరే వచ్చి విలీనమని అడిగితే.. అర్థమేంటి? అంతేకాదు.. విలీనం ప్రతిపాదన వచ్చేసరికే బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది కూడా. అంటే విలీనం అన్నది రాజకీయ కారణంతోనా? నా కోసమా? అన్నది ప్రశ్నార్థకమే.


మీపై మద్యం కేసు వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నష్టపోయిందని కేటీఆర్‌ అన్నారు?

బీఆర్‌ఎస్‌ ఓటమికి లక్ష అంశాలుంటే అందులో ఇదొకటి. కానీ, తీర్పు వచ్చిన గంట కూడా సంతోషంగా లేకుండా రామన్న ట్వీట్‌ వచ్చింది. కేసు వల్లే ఓడామని. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లివ్వలేదు. యువతకు ఉద్యోగాలివ్వలేదు. ఒక 30 సీట్లలో అభ్యర్థులను మార్చాల్సి ఉన్నా మార్చలేదు. వీళ్లు ఇంత దోచుకున్నారని, హత్య, దౌర్జన్యాల్లో ఉన్నారని, మళ్లీ వీళ్లేనా? అని ప్రజల్లో చర్చ జరిగింది.

నూతన పార్టీ పేరు, వివరాలు? సిద్ధాంతం ఏంటి?

మే నెల మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉంటుంది. పార్టీ పెట్టే ముందే కోర్టు నన్ను నిర్దోషి అని తీర్పివ్వడం ప్రకృతి ఆశీర్వాదం. నేను సెంటిమెంటల్‌. అది అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ముహుర్తంలోనే పార్టీ పేరు చెప్పాలని అనుకుంటున్నా. కొత్త రాజకీయ పార్టీ బలమైన ప్రాతిపదికపై వస్తుంది. నైతిక, సైద్ధాంతిక పునాది ఏంటనే దానిపై 50 కమిటీలు అంతర్గతంగా వేశా. తెలంగాణ సమాజంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన వారున్నారు. వారందరినీ కలుస్తున్నాం. సిద్ధాంతపరమైన పార్టీగానే వస్తాం. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారాక రాష్ట్రంలో మూడూ జాతీయ పార్టీలే. జాతీయ పార్టీలకు తెలంగాణ అనేది వంద అంశాల్లో ఒకటి. మాకు మాతృకే ఇది. తెలంగాణే ఫస్ట్‌.

ఓట్లు చీల్చేందుకే మీరు పార్టీ పెడుతున్నారని బీఆర్‌ఎస్‌, ఇదంతా కుటుంబ డ్రామా అని కాంగ్రెస్‌, బీజేపీ అంటున్నాయి? అసలు మీరు ఎవరివైపు?

బీఆర్‌ఎస్‌ నన్ను సస్పెండ్‌ చేసి బయటకు పంపేసింది. బీజేపీ నాపై కేసు పెట్టింది. కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది. అందుకే నేను స్వతంత్రంగా పోరాడతా. నాకు ఎవరి మద్దతు లేదు. నేను ఎవరివైపు లేను. ముగ్గురితోనూ కొట్లాడాలి. ఎవరో మద్దతిస్తే ఉపగ్రహంలా వెలుగుదామని అనుకుంటే ఎక్కువకాలం నడవదు. నేను ప్రజల కోసం, సమాజం కోసం, మంచి మార్పు కోసం నిలబడదామనుకున్నా.


ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో ఉండి.. ఇప్పుడదే పార్టీని విమర్శిస్తే ప్రజలెలా తీసుకుంటారు?

అంతకుముందు పదేళ్లు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వస్తోంది. అందుకే ఉద్యమకారులకు, రైతులకు క్షమాపణ చెప్పా. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను సమస్యలు లేవనెత్తుతున్నానే తప్ప వ్యక్తులను విమర్శించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా?

రాజకీయాల్లో ఉన్న సర్పంచ్‌ కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. నేను కూడా అనుకుంటా. అది నేను పడే కష్టంమీద ఆధారపడి ఉంటుంది. అయితే సీఎం అయితే లాభం ఏంటంటే.. ఒక్క సంతకంతో లక్షల మందికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఆ ఆలోచన తప్ప. నేను పవర్‌ చూడక కాదు. మంచి పనులే చేస్తా. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా. అస్థిత్వాన్ని కాపాడతా. కొండగట్టుకు టీటీడీ డబ్బులిచ్చారని పవన్‌కల్యాణ్‌ వచ్చి అక్కడ ప్రారంభాలు చేశారు. ఆ రోజు మన సీఎం గానీ, ఉప సీఎం గానీ ఎందుకు లేరు? తిరుమల హుండీల్లో తెలంగాణ డబ్బులు లేవా? ఒక ఆంధ్రా నాయకుడు వచ్చి రిబ్బన్‌ కత్తిరించడమేంటి? రాష్ట్రాల మధ్య గౌరవభావం ఉండాలి తప్ప డామినేషన్‌ కాదు.

రక్తసంబంధమా? రాజకీయమా? మీ పోటీ అమ్మ ఊరి నుంచా? అత్తమ్మ నియోజకవర్గం నుంచా?

రక్తసంబంధం సంబంధమే. రాజకీయం రాజకీయమే. 20 ఏళ్ల నుంచి ఒక సంస్థను స్వతంత్రంగానే నడపగలిగా. కేసీఆర్‌ వంటి మర్రిచెట్టు నీడలో చిన్నచెట్లు నిలబడవు అంటారు. అలాంటిది నేను సంస్థను నడిపాను. స్వతంత్రంగా పార్టీ పెడితే బలంగా నడపగలను. అమ్మ ఊరున్న నియోజకవర్గం సిద్దిపేట. అత్తమ్మ నియోజకవర్గం బోధన్‌. ఏదో ఒకటి ఎంచుకుంటా.

Updated Date - Mar 04 , 2026 | 03:20 AM