మున్సిపల్ ఫలితాలతో ఆ రెండు పార్టీల పొత్తుకు తొలి అడుగు: కవిత
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:21 PM
ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కంచుకోట ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. కమ్యూనిస్టులను తోక పార్టీగా అభివర్ణించిన బీఆర్ఎస్.. ఇప్పుడు సీపీఐకు మద్దతు ఇస్తానంటోందని వ్యాఖ్యలు చేశారు. తోక పార్టీలకే.. బీఆర్ఎస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. సీపీఐ అడగకుండానే.. కొత్తగూడెంలో సీపీఐకు కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వటం దిగజారుడే అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్, బీఆర్ఎస్‌ను అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్‌కు గుర్తు లేదా అని కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూనంనేని ఆరోపణలను కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా అని కవిత నిలదీశారు. కార్మికుల కోసం సీపీఐకు మద్దతు అంటోన్న కేటీఆర్ నయ వంచన చేసుకుంటున్నారని అన్నారు. అవసరం వచ్చినప్పుడు.. బీఆర్ఎస్‌కు కార్మికులు గుర్తొస్తారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని మున్సిపల్ ఫలితాలు చెప్తున్నాయన్నారు. మున్సిపాలిటీలను తీర్చిదిద్దానని చెప్పుకుంటోన్న కేటీఆర్.. ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఈ స్థానాలు రావడమే ఎక్కువ అన్నట్లు కేటీఆర్ మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. ‘నేనే రాజు నేనే మంత్రి.. సీఎం పదవి ఆరు నెలలు బోనస్’ అంటోన్న రేవంత్.. రైతుల బోనస్ గురించి మాట్లాడాలని కవిత డిమాండ్ చేశారు.
‘జాగృతిపై కామెంట్స్ చేస్తోన్న వారికి చెప్తున్న.. ఇది జస్ట్ ట్రైలర్.. పిక్చర్ బాకీ హై’ అని అన్నారు కవిత. కరీంనగర్ కార్పొరేషన్ కోసం బీజేపీ అష్టకష్టాలు పడుతోందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో తప్ప బీజేపీ ఎక్కడా లేదన్నారు. సింగరేణి ఎన్నికల్లో కూడా ఏఐఎఫ్‌బీతో కలిసి జాగృతి పోటీ చేస్తుందని ప్రకటించారు. 40కి పైగా స్థానాల్లో జాగృతి, ఏఐఎఫ్‌బీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కవిత. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎవరికి మద్దతివ్వాలో స్థానిక జాగృతి నేతలు డిసైడ్ చేసుకుంటారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వ సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారని కవిత ఆరోపించారు. గతంలో 90 శాతం గెలిచిన బీఆర్ఎస్.. 17 సీట్లకు పడిపోవటం దారుణమన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ముందే డిసైడ్ అయిందని కవిత వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
Read Latest Telangana News And Telugu News