Share News

ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:24 PM

యువత సాగు వైపు మళ్లాలంటే వ్యవసాయ రంగం లాభదాయకంగా మారాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు మంత్రి.

ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగం: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

అమరావతి, ఫిబ్రవరి 14: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. రైతులను రాజులుగా చేయడమే లక్ష్యంగా 'రైతన్న మీ కోసం' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని అచ్చెన్నాయుడు తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామన్నారు.


యువత వ్యవసాయం వైపు మళ్లాలంటే రంగం లాభదాయకంగా మారాలని మంత్రి చెప్పుకొచ్చారు. అధిక పోషక విలువలు ఉండే పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం కల్పిస్తామని చెప్పారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం ఉందని, 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని వెల్లడించారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం సాధించిందని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు.


సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు మంత్రి. ప్రభుత్వం రైతులకు వివిధ రూపాల్లో సాయం అందిస్తోందని వివరించారు. 24 గంటల్లో 9 వేల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద రూ.6,309 కోట్లు చెల్లించామన్నారు. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామని చెప్పారు. ధాన్యం సేకరణ బకాయిలుగా రూ.1,674 కోట్లు చెల్లించామని తెలిపారు.


భూసార పరీక్షల ద్వారా 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు అందజేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించామని పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు కేటాయించామని వివరించారు. 80 శాతం రాయితీతో రూ.90.4 కోట్లతో.. 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా చేశామని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 03:17 PM