Share News

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:38 PM

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యాకలాపాల పునరుజ్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వివరించారు. ఆర్థిక శాఖ వర్గాలు ఇలాంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించడం ఇదే తొలిసారి.

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన
AP Budget 2026-27

అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav). గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యాకలాపాల పునరుజ్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వివరించారు. స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా బడ్జెట్‌లో పొందుపరిచారు. ఆర్థిక శాఖ వర్గాలు ఇలాంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ వివరాలను చేర్చామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


వడ్డీలను తగ్గించాలని...

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలను తగ్గించామని వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. 12.3 శాతం వడ్డీని 9 శాతానికి తగ్గించేలా ఆ సంస్థలను ఒప్పించామని వివరించారు. ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిగాయని అన్నారు. దీని ఫలితంగా ఏడాదికి రూ. 327 కోట్లు ఆదా అవుతోందని చెప్పారు. మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఇవి ఫలిస్తే ఏడాదికి రూ. 1658 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి.


నిధుల విడుదల పెరిగింది..

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల్లో రూ. 24,811 కోట్లు చెల్లించామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ఇరిగేషన్, రహదారుల పనుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రూ.37,030 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పంచాయతీలు, మున్సిపాల్టీల బలోపేతం కోసం ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ. 3,797 కోట్ల మేర బదలాయించామని చెప్పారు. గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 స్కీమ్‌ల పునరుద్ధరణకు రూ. 18,701 కోట్లు వెచ్చించామని చెప్పారు. దీని ఫలితంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు విడుదల అవుతున్నాయని మంత్రి పయ్యావుల వివరించారు.


రూ.100 కోట్లతో ఏపీ హెల్త్ ఫండ్‌ ...

సంపద సృష్టి లక్ష్యంగా ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటును బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రూ.100 కోట్ల కార్పస్‌తో ఈ ఫండ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఫండ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నామని బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూరేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వివిధ దేశాలు సావరిన్ ఫండ్‌ల ద్వారా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు, అదే విధానాన్ని ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అవలంబిస్తోందని మంత్రి వివరించారు.


ఆర్థిక సంస్కరణలపై...

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి తీసుకొచ్చిన సంస్కరణలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రెడ్స్ డిజిటల్ ప్లాట్‌ఫాం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. సాస్కీ కింద ఇప్పటి వరకు రూ. 6,544 కోట్ల నిధులను వినియోగించుకున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో రూ. 1,438 కోట్లు వినియోగించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. పార్ట్‌నర్షిప్ సమ్మిట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని, ఏపీ లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. పారిశ్రామిక వృద్ధి కోసం ఇప్పటి వరకు 26 పాలసీలు రూపొందించామని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 01:18 PM