ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:32 AM
ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆర్థిక మంత్రి.
అమరావతి, ఫిబ్రవరి 14: 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తన అదృష్టమని అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది బడ్జెట్ అన్నారు. కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం తమది అని స్పష్టం చేశారు.
బ్రాండ్ చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్ర సాకారమన్నారు ఆర్థిక మంత్రి . గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చేసుకుంది బాహుబలి ఒప్పందమని తెలిపారు. రైతుల కలలను నెరవేర్చేలా, యువతకు ఉద్యోగవకాశాలు కల్పించేలా, తన బిడ్డలను చక్కగా పెంచాలనే తల్లికి భరోసా ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. పాలన ఎలా చేయకూడదో అనేది గత ప్రభుత్వ రాష్ట్రానికి చేసిన నష్టాన్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు . గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే... స్వర్ణాంధ్ర విజన్-2047కు బాటలు వేస్తూ 2025లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఆర్థిక విధ్వంసం ఎదుర్కొన్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి రెండేళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదని మంత్రి చెప్పారు.
రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టంతో పాటు... గత ప్రభుత్వ పాలన కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు మంత్రి. చాలా సవాళ్లు ఉన్నా రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం... ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు. కాగితాలకే పరిమితం కాకుండా... క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
బడ్జెట్ ప్రతులతో కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
Read Latest AP News And Telugu News