Share News

రేవంత్‌ అసమర్థత వల్లే ఏపీ జలదోపిడీ

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:13 AM

సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత ఆరోపించారు.

రేవంత్‌ అసమర్థత వల్లే ఏపీ జలదోపిడీ

  • ఆయన అడ్డుకోలేరన్న ధైర్యంతోనే నాగార్జున సాగర్‌కు గండి

  • ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు పట్టదా?

  • వారం రోజుల్లోగా ఆపకపోతే సాగర్‌ను ముట్టడిస్తాం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లే ఏపీ జలదోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అడ్డుకోలేరన్న ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం తాగు నీటి పేరుతో నాగార్జున సాగర్‌కు గండికొడుతోందంటూ శనివారం వీడియో సందేశం విడుదల చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్‌లో కాళ్లు కడిగి గురుదక్షిణగా రేవంత్‌రెడ్డి మన నీళ్లను అప్పగించారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం 9 నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదనే వాదనను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఇది అనేక సందేహాలకు తావిస్తోందన్నారు.


‘‘నిజంగానే సమాచారం లేదా? అలా కాకుండా రేవంత్‌ సమ్మతితోనే ప్రాజెక్టు చేపట్టారు కాబట్టి మౌనంగా ఉన్నారా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. బీజేపీకి తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని నిలదీశారు. ఎంపీ రఘునందన్‌ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని నిలదీశారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి ఏపీ అక్రమ ప్రాజెక్టును ఆపించాలని, ఆ ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు జల్‌ జీవన్‌ మిషన్‌ నుంచి ఇవ్వకుండా అడ్డుకోవాలని సూచించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలదేనని అన్నారు. వారంలోగా ఏపీ తమ అక్రమ ప్రాజెక్టును నిలిపివేయకుంటే వేలాది మందితో సాగర్‌ డ్యాంను ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు.


రేవంత్‌ ఆమోదంతోనే లింక్‌ ప్రాజెక్టు

రేవంత్‌రెడ్డి ఆమోదం వల్లే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును చేపట్టిందని కవిత ఆరోపించారు. జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కోసం డిమాండ్‌ చేయకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో అనధికారిక సమావేశానికి వెళ్లి, పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు రేవంత్‌ ఒప్పుకొని వచ్చారని తెలిపారు. కాగా, ఈనెల 26న నిర్వహించనున్న ‘మహిళలు- రాజ్యాంగం’ సదస్సు పోస్టర్‌ను కవిత శనివారం ఆవిష్కరించారు. 26న బాగ్‌ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 07:13 AM