Share News

ఇంటర్మీడియట్‌ బోర్డు రద్దు వద్దు

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:25 AM

విద్యారంగం పట్ల ముఖ్యమంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంటర్‌బోర్డు రద్దు చేయాలన్న తప్పుడు నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు.

ఇంటర్మీడియట్‌ బోర్డు రద్దు వద్దు
Kalvakuntla Kavitha

  • విద్యావ్యవస్థను ప్రభుత్వం వెంటిలేటర్‌పై పెట్టింది

  • ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: కల్వకుంట్ల కవిత

  • తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యారంగం పట్ల ముఖ్యమంత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంటర్‌బోర్డు రద్దు చేయాలన్న తప్పుడు నిర్ణయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే వెనక్కు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ‘ఇంటర్‌ బోర్డు రద్దు - తెలంగాణ విద్యపై ప్రభావం’ అనే అంశంపై మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర విద్యావ్యవస్థ ఐసీయూలో చేరిందని, ఇప్పుడు పరిపక్వత లేని నిర్ణయాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని వెంటిలేటర్‌పై పెట్టిందని విమర్శించారు. ఏపీ విఫలమైన ప్రయోగం ఇక్కడ అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. అఖిలపక్షం, మేధావులు, అధ్యాపకులతో చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో నష్టం జరిగే ప్రమాదం ఉందని, 9 నుంచి 12 తరగతుల వరకు విద్యాసంస్థలకు అనుమతులిస్తే ఆంధ్రా విద్యార్థులు ఇక్కడకు వచ్చి పరీక్షలు రాస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. 55 ఏళ్లుగా ఉన్న వ్యవస్థను ఏకపక్షంగా రద్దుచేస్తామంటే ఊరుకోబోమని, ఈ అంశంపై బిల్లు తెచ్చే ముందు పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఇంటర్మీడియేట్‌ బోర్డును ఎందుకు రద్దు చేస్తునారన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ. ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.


ఐఏఎస్‌లు సబ్జెక్టు నిపుణులు కాదని.. వారి నిర్ణయాలు అమలు చేస్తే ఎంతో నష్టపోవాల్సి వస్తుందన్నారు. డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకోకుండా విద్యావిధానాన్నే మార్చడం సరికాదని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు విద్యావేత్తలను, మేధావులను భాగస్వాములను చేయాలని సూచించారు. సమావేశంలో సీనియర్‌ పాత్రికేయుడు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యావిధానం తీసుకువస్తే స్థానికత అంశంపై ప్రభావం పడుతుందని, 50 ఏళ్లుగా ఉన్న వ్యవస్థను మార్చేముందు విస్తృతంగా చర్చించాలన్నారు. ఎవరితోనూ చర్చించకుండా బోర్డు రద్దు చేస్తామనడం సరికాదని ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 800 జూనియర్‌ కళాశాలలు మూతపడతాయని ఇంటర్‌ విద్య జేఏసీ ఛైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 06:25 AM