ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దు: కవిత
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:46 PM
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
హైదరాబాద్, జులై 21: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ కవిత రూపొందించిన నివేదికను ఆ కమిటీకి అందజేశారు. మంగళవారం ట్యాంక్ బండ సమీపంలోని అమరజ్యోతి కార్యాలయంలో ఉద్యమకారుల ఎంపిక కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. స్వతంత్ర సైనిక సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్‌ను స్టడీ చేయాలని ఆ కమిటీకి సూచించారు. వాటిలో ఉన్న విధంగా ఉద్యమకారులకు ప్రయోజనం కలిగించాలని స్పష్టం చేశారు.
కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనే భావన ఉంది.. అది తప్పని నిరూపించాలని ఆమె పేర్కొన్నారు. ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్‌లో అంతర్గతంగా పోరాటం చేసి బలైన వ్యక్తిని తానని గుర్తు చేసుకున్నారు. తన సూచనలు, సలహాల ద్వారా ఉద్యమకారులకు కొంత మేలు జరిగిన తన జన్మ ధన్యమైనట్లేనని టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటం, గౌరవించటం కోసం కమిటీ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను కూడా ఇందులో చేర్చాలని గుర్తింపు కమిటీకి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జైల్లో ఉన్న వారు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్లు నమోదైన వాళ్ల విషయంలో ఆలస్యం చేయకుండా గుర్తించాలని వివరించారు. ప్రాపర్టీ లాస్, డిసబులిటీ, పోలీస్ అట్రాసిటీ అనుభవించిన వాళ్లను వెంటనే గుర్తించాలని పేర్కొన్నారు.
పది సార్లు లాఠీ దెబ్బలు తిన్న వాళ్లకు కూడా వెంటనే గుర్తించాలని కవిత చెప్పారు. ఉద్యమంలో ఉద్యోగం పోయిన వాళ్లకు మేలు చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉందని గుర్తు చేశారు. కొన్ని చోట్ల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల డీలర్ షిప్‌లను రద్దు చేయించారని తెలిపారు. వాళ్లందరీ విషయంలో కమిటీ మానవతా ధృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నానని చెప్పారు. ఉద్యమకారులు ఎవరైనా చనిపోతే మొదటి ప్రయారిటీ వాళ్ల భార్య, లేదంటే వాళ్ల పిల్లలు, తల్లిదండ్రులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ స్కీమ్ పెట్టిన సరే స్కామ్ అవుతుందని.. ఈ నేపథ్యంలో అలా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గుర్తింపు కమిటీకి కవిత సూచించారు.
జార్ఖండ్‌లో ఉద్యమకారులకు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా అక్కడ పర్మినెంట్ కమిటీ ఉందని.. వీలు అయితే ఇక్కడ కూడా అలాంటిదే ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. గోవా, దాద్రా నగర్ హవేలి, బిహార్, యూపీ, మహారాష్ట్రల్లో ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు. వాటిని అన్నింటిని స్టడీ చేస్తే సరిపోతుందని అన్నారు. రూల్ పొజిషన్, చట్టబద్దత అంటూ సమయం వృథా చేయవద్దని గుర్తింపు కమిటీకి సూచించారు. ఈ సమావేశానికి జర్నలిస్టులు, డాక్టర్లు, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కె. కేశవరావును నియమించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలి: ప్రజలకు ఆర్వీ కర్ణన్ సూచన
పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీశ్ రావు: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And Telugu News