Share News

వెళ్తున్నానని తెలిసి.. అలా వచ్చి వెళ్లారు: జీవన్ రెడ్డి

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:56 PM

కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు టీ. జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. మంగళవారం జగిత్యాలలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్.. జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం జీవన్ రెడ్డి స్పందించారు.

వెళ్తున్నానని తెలిసి.. అలా వచ్చి వెళ్లారు: జీవన్ రెడ్డి

జగిత్యాల, మార్చి 24: తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు చూసిందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి రాకున్నా.. పార్టీ అధికారంలోకి వచ్చినందుకు సంతోషపడ్డానన్నారు. మంగళవారం జగిత్యాలలోని తన నివాసానికి పార్టీ అధిష్ఠానం పంపిన దూతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో తనది పూలబాట కాదని.. ముళ్ల బాట అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ కాబట్టి రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి, సీఎల్పీ లీడర్ కాబట్టి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారన్నారు. కానీ తాను శాసన మండలిలో నేతను అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గుర్తు చేశారు.


మరి తనకెందుకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల్లో మనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శం కాదు కదా? అంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన చరకలంటించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏమిటి? మనం చేస్తున్నదేమిటంటూ రాష్ట్రంలోని పార్టీ నేతలను ఈ సందర్భంగా ఆయన సూటిగా నిలదీశారు.


పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వంటి నేతలు ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకంటూ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా కొంత అసహనం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనను బుజ్జగించలేదని చెప్పారు. తాను పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి.. అలా వచ్చి వెళ్లారంటూ కాంగ్రెస్ ప్రతినిధుల రాకపై జీవన్ రెడ్డి స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

ఈ చిన్న చిట్కాతో ఆర్థరైటిస్‌కు చెక్..

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 01:26 PM