లగచర్ల ఖైదీ చేతికి సంకెళ్లు.. జైలు సూపరింటెండెంట్‌పై విచారణ
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:03 AM
లగచర్ల కేసులో నిందితుడికి సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఐజీ నేతృత్వంలో సమగ్ర విచారణకు హోంశాఖ ఆదేశం
రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): లగచర్ల కేసులో నిందితుడికి సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సంగారెడ్డి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో విచారణ ఖైదీగా ఉన్న జర్పుల హీరియా నాయక్ (ఖైదీ నం.44) ఛాతీ నొప్పితో బాధపడుతుండటంతో అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఖైదీ చేతులకు బేడీలు, లీడింగ్ చైన్ వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రసార సాధనాల్లో రావడంతో జైళ్ల శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
ఈ ఉదంతం జైలు పరిపాలనా వ్యవస్థకే మచ్చ తెచ్చిందని, అందుకు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని జైళ్ల శాఖ డీజీ ప్రభుత్వానికి నివేదించారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991 ప్రకారం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. డీజీ నివేదిక ఆధారంగా జారీ చేసిన చార్జ్ మెమోకు సంతోష్ కుమార్ రాయ్ ఇచ్చిన రాతపూర్వక వివరణపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సీసీఏ రూల్స్‌లోని 20(5) నిబంధన ప్రకారం ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ విచారణ అధికారిగా జైళ్ల శాఖ ఐజీ రాజేశ్‌ను, ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించే అధికారిగా వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ కుమార్‌ను నియమించింది. కేసుకు సంబంధిచిన రికార్డులను తక్షణమే విచారణాధికారికి అందించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌ను ఆదేశించిన ప్రభుత్వం, రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
నేడు, రేపు భారీ వర్షాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News