ఛత్రపతి శివాజీ.. ప్రజా నాయకుడు
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:29 AM
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయుల చరిత్రను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు.
మహనీయుల చరిత్రను రాజకీయాలకు వాడొద్దు..
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వక్రభాష్యాలు చెప్తోంది
శివాజీని ఓ మతానికి పరిమితం చేయడం సరికాదు
ఆయన దగ్గర ఉన్నతాధికారులుగా ముస్లింలూ ఉన్నారు
రాజ్య భద్రత కోసమే ముస్లిం రాజులతో యుద్ధాలు చేశారు
శివాజీ గురించి యువత అధ్యయనం చేయాలి: జగ్గారెడ్డి
సంగారెడ్డి బైపాస్ రోడ్డులో శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
సంగారెడ్డిటౌన్, అక్టోబరు 11, (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహనీయుల చరిత్రను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. శివాజీ.. ఓ మతానికి చెందిన నాయకుడు కాదని, ప్రజా నాయకుడని పేర్కొన్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం శివాజీ చరిత్రను వక్రీకరించి ప్రచారం చేస్తోందని విమర్శించారు.
శివాజీ పాలనలో హిందువులతోపాటు ముస్లింలూ సంతోషంగా జీవించారని, ఆయన వద్ద దౌలత్ ఖాన్, ముల్లా హైదర్ వంటి ముస్లిం అధికారులు ఉన్నత స్థాయిలో పని చేశారని గుర్తు చేశారు. గొప్ప వీరుడైన శివాజీ ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతతో పాలన సాగించారని పేర్కొన్నారు. ఒక రాజుగా ముస్లిం పాలకులతో యుద్ధాలు చేశారే తప్పా, ముస్లిం ప్రజలపై దాడులు చేయలేదనిని వెల్లడించారు. రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు మతపరమైన అర్థాలు ఆపాదించడం సరికాదన్నారు. శివాజీ మహారాజ్ చరిత్రను యువత అధ్యయనం చేసి, ఆయన వీరత్వం, పాలనా దక్షత, ప్రజల పట్ల నిబద్ధతను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
Read Latest AP News And Telangana News