నీ అంతు చూస్తా..?
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:24 AM
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) వైస్ ఛాన్స్‌లర్, వీజేఐటీ ప్రిన్సిపాల్ మధ్య వివాదం కొత్త మలుపు తీసుకుంది. వీజేఐటీ సంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్‌కాల్ చేసి తమను బెదిరించారని జేఎన్‌యూటీ వీసీ భార్య సృజన కిషన్‌రెడ్డి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు.
నా కళాశాల ఆహ్వానాన్నే తిరస్కరించే ధైర్యం వచ్చిందా?
జేఎన్‌టీయూ వీసీకి వీజేఐటీ కళాశాల యజమాని పల్లా రాజేశ్వర్‌రెడ్డి బెదిరింపులు
కేపీహెచ్‌బీ పోలీసులకు వీసీ భార్య ఫిర్యాదు
అంతకుముందే వీసీపై ఫిర్యాదు చేసిన వీజేఐటీ ప్రిన్సిపాల్
హైదర్‌నగర్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) వైస్ ఛాన్స్‌లర్, వీజేఐటీ ప్రిన్సిపాల్ మధ్య వివాదం కొత్త మలుపు తీసుకుంది. వీజేఐటీ సంస్థల అధినేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫోన్‌కాల్ చేసి తమను బెదిరించారని జేఎన్‌యూటీ వీసీ భార్య సృజన కిషన్‌రెడ్డి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తమ కళాశాలలో నిర్వహిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కార్యక్రమానికి రావాలని విజేఐటీ ప్రిన్సిపాల్ సృజన, హెచ్‌వోడీ అరుణకుమారి తదితరులు ఈనెల 6న జేఎన్‌టీయూ వీసీ కిషన్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. గతంలో తాను వీజేఐటీలో పనిచేసినప్పుడు యాజమాన్యం (పల్లా రాజేశ్వరరెడ్డి) తనను చాలా అవమానించిందని, ఈవెంట్ వచ్చే ప్రసక్తే లేదని వీసీ తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి రావాలని మహిళా ప్రొఫెసర్లు కోరారు.
అందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇన్విటేషన్‌ను చించి చెత్తబుట్టలో పడేశారు. దాంతో ప్రిన్సిపాల్ సృజన జరిగిన విషయాన్ని పల్లా రాజేశ్వరరెడ్డికి ఫోన్‌లో వివరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత జేఎన్‌టీయూ వీసీ కిషన్‌రెడ్డిపై ప్రిన్సిపాల్ సృజన కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా అభ్యంతరకరంగా మాట్లాడి అవమానించారని, మహిళలు ఉద్యోగాలు చేయడానికి పనికిరారని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జేఎన్‌టీయూ వీసీ కిషన్‌రెడ్డి భార్య సృజన కిషన్‌రెడ్డి సైతం 9వ తేదీన కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపాల్ సృజన జేఎన్‌టీయూకు వచ్చి తన భర్త వీసీ కిషన్‌రెడ్డిని ఎడబ్ల్యూఎస్ కార్యక్రమానికి ఆహ్వానించగా, అందుకు ఆయన రాలేనని సున్నితంగా తిరస్కరించారని తెలిపారు.
దీంతో వీజేఐటీ సంస్థల అధినేత పల్లా రాజేశ్వరరెడ్డి తమకు వాట్సాప్ కాల్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘నా కళాశాల ఆహ్వానాన్నే తిరస్కరించే ధైర్యం వచ్చిందా? మీ అంతు చూస్తా’’అని భయపెట్టారని వీసీ భార్య సృజన కిషన్‌రెడ్డి తెలిపారు.. తిరుపతి ఏయిర్ పోర్టులో ఉన్నామని, కొద్దిసేపటి తర్వాత మాట్లాడతామని చెప్పినా వినకుండా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయబ్రాంతులకు గురిచేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి కాల్ రికార్డులను, స్ర్కీన్ షాట్‌లను పోలీసులకు అందజేశారు. రెండు ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ విజయ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?
Read Latest AP News And Telangana News