ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌తో జగ్గారెడ్డి భేటీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:59 AM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్‌కుమార్‌తో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి గాంధీభవన్‌లో భేటీ అయ్యారు.
ఇప్పటికే అనేక మందికి పదవులిచ్చిన సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
మిగిలినవి కూడా తొందరగా పూర్తి చేయాలి
గ్రామ స్థాయినుంచి పార్టీని బలోపేతం చేయండి
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి జగ్గారెడ్డి సూచన
డ్రగ్స్ దందాను అణచివేసిన సీఎం రేవంత్
కిషన్‌రెడ్డి పాదయాత్ర ఓ ఎన్నికల స్టంట్
పదవులు బీజేపీ నేతలకు కొత్త.. రాహుల్‌కు కాదు
ప్రధాని పదవి పుట్టిందే వాళ్ల ఇంట్లో
డీలిమిటేషన్ అయితే 20.. కాకుంటే 14ఎంపీ సీట్లు
తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు వచ్చే సీట్లివి
ఈ మేరకు సీఎం, టీపీసీసీ చీఫ్ ప్రణాళిక: జగ్గారెడ్డి
హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం సందీప్‌కుమార్‌తో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ప్రభుత్వ, పార్టీ పదవుల భర్తీపై చర్చ జరిగింది. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనేకమంది పార్టీ నేతలకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ప్రభుత్వ, పార్టీ పదవులిచ్చారని చెప్పారు. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలంటూ తాను సందీ్‌పకుమార్‌కు చెప్పినట్లు వెల్లడించారు. తనకంటూ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులూ లేవన్నారు.
కాగా.. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ దందాలను ఉక్కుపాదంతో అణిచేశారన్నారు. మూడేళ్ల తర్వాత కళ్లు తెరిచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి... ఇప్పుడు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఈ పాదయాత్ర ఓ ఎన్నికల స్టంట్ అంటూ కొట్టిపారేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని కాలేరంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని జగ్గారెడ్డి అన్నారు. పదవులు బీజేపీకి కొత్త కానీ.. రాహుల్‌గాంధీ కుటుంబానికి కాదన్నారు. ప్రధాని పోస్టు పుట్టిందే రాహుల్‌గాంధీ ఇంట్లోనని, ఇది ఇంతకు ముందే చాలా సార్లు చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ 14 లోక్‌సభ సీట్లు.. నియోజకవర్గ పునర్విభజన జరిగితే 20 లోక్‌సభ సీట్లు గెలిచేలా సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముందు బీజేఎల్పీ నేతగా గుర్తింపు తెచ్చుకుని, తర్వాత సీఎం రేవంత్ గురించి మాట్లాడాలని హితవు పలికారు.
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా