Share News

రోడ్డు ‘భద్రత’ కరువు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:44 AM

రోడ్డు ప్రమాదం జరిగిందంటే.. అతివేగమో, డ్రైవర్ల తప్పిదమో అని భావిస్తుంటాం. కానీ ప్రమాదాలకు అంతకన్నా ముఖ్యమైన కారణం రోడ్లే.

రోడ్డు ‘భద్రత’ కరువు!
India Road Accidents

  • రహదారుల్లో లోపాలతోనే 59శాతం ప్రమాదాలు..

  • అడుగడుగునా గుంతలు..

  • అదుపుతప్పుతున్న వాహనాలు

  • ఎగుడు దిగుడు రోడ్లు, లోపభూయిష్ఠమైన డిజైన్లు

  • అతివేగం వల్ల జరిగే ప్రమాదాలు 16శాతమే

  • డ్రైవర్ల తప్పు వల్ల జరిగేవి 41శాతం

  • గుంతల వల్ల ప్రమాదాల్లో 53 శాతం పెరుగుదల

  • దేశంలో ప్రతి గంటకు 21 మరణాలు..

  • తెలంగాణలో రోజుకు 20మంది బలి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదం జరిగిందంటే.. అతివేగమో, డ్రైవర్ల తప్పిదమో అని భావిస్తుంటాం. కానీ ప్రమాదాలకు అంతకన్నా ముఖ్యమైన కారణం రోడ్లే. దేశంలో వాహన ప్రమాదాలు, వాటివల్ల జరుగుతున్న మరణాల్లో ఏకంగా 59శాతం రోడ్ల నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే జరుగుతున్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)-సేవ్‌ లైఫ్‌ సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, గుర్తులు లేని స్పీడ్‌ బ్రేకర్లు, రోడ్డు అంచుల్లో ఎత్తు తేడా, జారిపోయేలా రోడ్డు ఉపరితలం, నీరు నిలిచిపోవడం, సూచిక బోర్డులు లేకపోవడం, లోపభూయిష్ఠంగా డిజైన్‌, వెలుతురు లేకపోవడం, తవ్వి వదిలేసిన రోడ్లు, మలుపుల దగ్గర చెట్లు, హోర్డింగ్‌లు, రాత్రిపూట కనిపించేలా రేడియం స్టిక్కర్లు లేకపోవడం.. ఇలాంటివి రోడ్లపై రక్తపాతానికి దారితీస్తున్నాయి.


2025లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 1.80 లక్షల మంది మరణించగా.. 2026 తొలి ఆరునెలల్లోనే 1.01లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాల్లో కుటుంబాలకు ఆధారమైనవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా శారీరక వైకల్యం బారినపడుతున్నారు. దీనితో ఆ కుటుంబాలకు తీరని శోకం, కష్టం తప్పడం లేదు. ఇటీవల ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సులో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని వాపోవడం గమనార్హం.


తెలంగాణలో బ్లాక్‌స్పాట్లు.. 1,513

ఏదైనా రహదారిపై అర కిలోమీటరు పరిధిలో మూడేళ్లలో ఐదు ప్రమాదాలు జరిగి, 10మంది, ఆపైన చనిపోతే బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. విపరీతమైన మలుపులు, సరిగ్గా డిజైన్‌ చేయని జంక్షన్లు, సూచిక బోర్డులు-లైట్లు లేకపోవడం, గుంతలు వంటివే దీనికి కారణం. తెలంగాణలో రహదారులపై ఇలాంటి బ్లాక్‌స్పాట్లు 1,513 ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 131, జగిత్యాలలో 107, మంచిర్యాల జిల్లాలో 83 బ్లాక్‌స్పాట్లను నిర్ధారించారు. ఇటీవల కాలంలో వీటిలో పలుచోట్ల మరమ్మతులు చేశామని, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాజీవ్‌ రహదారిపై ఒక్క ఏడాదిలోనే 504మంది ప్రమాదాల్లో కన్నుమూశారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి, ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా ప్రమాదాలకు నెలవుగా మారాయి.


రోడ్డు ప్రమాద కారణాలు, లెక్కలివీ..

  • 2025లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారు: సుమారు 1.80 లక్షలు.

  • ఇందులో అధ్వాన్న రోడ్లతో ప్రమాదాలు జరిగి మరణించినవారు: సుమారు 1.06 లక్షలు

  • 2020-2024 మధ్య కేవలం గుంతల వల్ల ప్రాణాలు కోల్పోయినవారు: 9,438మంది

  • (2020లో 1,555 మంది, 2024లో 2,385మంది.. మృతి చనిపోయారు. 53శాతం పెరుగుదల)

  • ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18-45 ఏళ్ల మధ్యవయసువారు: 72శాతం

  • దేశంలో ప్రతి గంటకు ప్రాణాలు కోల్పోతున్నవారు: 21 మంది

  • తెలంగాణలో ప్రతిరోజు ప్రమాదాల్లో మరణిస్తున్నవారు: 20 మంది

  • రాష్ట్రంలో ఏటా ప్రాణాలు కోల్పోతున్నవారు: సుమారు 7 వేలు

  • రోడ్డు ప్రమాద మరణాల్లో దేశంలో తెలంగాణ స్థానం: 7వ స్థానం


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:44 AM