Share News

HILT Policy: ఇప్పటికైనా మేల్కోకపోతే.. హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:53 PM

తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్‌పాలసీపై మంగళవారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

HILT Policy: ఇప్పటికైనా మేల్కోకపోతే.. హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జనవరి 06: పారిశ్రామిక ప్రగతి కంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్‌పాలసీ తీసుకువచ్చామన్నారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్‌పాలసీపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ హిల్ట్‌పాలసీ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలంటూ ప్రతిపక్షాలకు సూచించారు. హిల్ట్‌పాలసీలో ఏదో మతలబ్ ఉందని ఆరోపణలు చేశారని తెలిపారు. కొండను తవ్వుతూనే ఉన్నారని.. ఎంత తవ్వుతారో తాము చూస్తామన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వంపై కావాలనే ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత.. అసమర్థ నాగరికతే అవుతుందని అభివర్ణించారు. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదన్నారు. పిల్లలకు ఆస్తులు కాదు.. శుభ్రమైన వాతావరణం ఇవ్వడమే నిజమైన వారసత్వమని ఈ సందర్భంగా మంత్రి డి.శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.


ఇంకా చెప్పాలంటే బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదని మంత్రి హెచ్చరించారు. మనమంతా భూమి యజమానులు కాదని.. కేవలం ట్రస్టీలమేనన్నారు. భవిష్యత్తు తరాలకు క్లీన్ ఎన్వీరాన్‌మెంట్ ఇవ్వడం మన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.


ఢిల్లీలో నివాసాల మధ్యనున్న 168 పరిశ్రమలను.. తరలించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. చైనాలో బ్లూ స్కై విధానం ద్వారా.. భారీ పరిశ్రమలను నగరం అవతలికి తరలించారని వివరించారు. కాలుష్య కారక పరిశ్రమలు ఓఆర్ఆర్ (ORR) లోపల ఉండకూడదనే హిల్ట్‌పాలసీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా ముందుకెళ్లేలా హిల్ట్ పాలసీ అమలు చేస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించ వద్దా? అంటూ ప్రతిపక్షాలను మంత్రి శ్రీధర్‌బాబు సూటిగా ప్రశ్నించారు.


2013లోనే రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌ పరిశ్రమలను.. ORR అవతలికి తరలించాలని జీఓ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల భవిష్యత్‌ దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. ప్రజలను కాలుష్యం నుంచి రక్షించాలనే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. హిల్ట్‌పాలసీ బయటకు రాకముందే విమర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఇస్తున్నారని మాట్లాడుతున్నారని.. అయితే కనీస సమాచారం తెలియకుండా బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ హిల్ట్‌పాలసీపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ఈ పాలసీపై కింద 6 నెలల గడువు ఇస్తామని పేర్కొన్నారు.


స్వచ్ఛందంగా ముందు కొస్తేనే భూములు కన్వర్ట్‌ చేస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల భూములు.. ప్రభుత్వానివి అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దశాబ్దాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయని గుర్తు చేశారు. మనం భూ యజమానులం కాదని.. ట్రస్టీలం మాత్రమేనని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ల్యాండ్‌ కన్వర్షన్‌పై బలవంతం ఏమీలేదన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇష్టమైతేనే ల్యాండ్‌ కన్వర్షన్‌ చేస్తామని తెలిపారు.


గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పర్యావరణ విధ్వంసం ఆగాలన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు అపార్ట్‌మెంట్స్‌ పక్కనే ఉన్నాయని.. పరిశ్రమలు, రెసిడెన్షియల్‌ ప్రాంతాల మధ్య బఫర్‌జోన్లు లేవన్నారు. బఫర్‌ జోన్లు లేకపోవడం వల్లే.. గతంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్‌, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌‌లో గ్యాస్ వంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. పారిశ్రామిక రసాయనాల వల్లే భూగర్భ జలాలు విషపూరితం అవుతాయని తెలిపారు. ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్‌ కూడా.. ఢిల్లీ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మంత్రి శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి

విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 06 , 2026 | 06:04 PM