Jaggareddy In Sangareddy: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు: జగ్గారెడ్డి
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:08 PM
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్‌కు సూచించారు.
సంగారెడ్డి, జనవరి 06: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ కేడర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డిలో స్థానిక, సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సమావేశాన్ని జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పిలవద్దని కేడర్‌కు స్పష్టం చేశారు. భవిష్యత్ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిని ఈ ఎన్నికల ప్రచారానికి పిలవాలని పార్టీ కేడర్‌కు ఆయన సూచించారు.
టికెట్ల కోసం ఎవరూ రావద్దు..
ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం తన వద్దకు ఎవరూ రావద్దన్నారు. తాను ప్రచారానికి రాకున్నా.. ఈ జగ్గారెడ్డిని సంగారెడ్డి పట్టణ ప్రజలు నమ్ముతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మీ గెలుపు కోసం చేసే వాగ్దానాలన్నీ తానే తీరుస్తానంటూ కేడర్‌కు ఈ సందర్భంగా జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. తన జీవితంలో మొత్తం పోలీసులను ఎదిరించి రాజకీయం చేశానని గుర్తు చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని తానెప్పుడు రాజకీయం చేయలేదని చెప్పారు.
పీసీసీ చీఫ్‌ను ఇబ్బంది పెట్టకండి..
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూడవద్దని పార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం గాంధీ భవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఎన్నికల ప్రచారంలో మీరు ఏం హామీలు ఇస్తారో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటిని నెరవేర్చే బాధ్యత తనదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
అలా చేస్తే వేటు ఖాయం..
ఈ ఎన్నికల బరిలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఓడించాలని చూసే వారిపై వేటు ఖాయమని నేతలను జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటారని ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రకటించారు. బీసీ, బీసీ మహిళా, జనరల్ ఇలా ఏ కేటగిరి అయినా.. ఆయనే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా షఫీ హఫీజ్ ఉంటారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News