861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:32 AM
అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి..
అమీన్‌పూర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్మేశారు! లే అవుట్లు చేసి.. ప్లాట్లు అమ్మేశారు! రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నోటరీ పేరిట విక్రయించేశారు! ఈ అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించి 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. గత పదేళ్ల నుంచి ఐలాపూర్ గ్రామ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భారీ భవనాలను, ఇండ్లను, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కూల్చివేతల ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్‌లో హైడ్రాతోపాటు పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫాంహౌజ్, గెస్ట్‌హౌజ్ నేలమట్టం
ఐలాపూర్‌లోని సర్ఫేఖాస్ భూములపై నాలుగు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక్కడ 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రికార్డుల్లో ఇది నిజాం పాలకులకు చెందినదిగా ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కింది. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అయినా, ఈ భూములపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హైడ్రా పలు నిర్మాణాలకు రెవెన్యూ ద్వారా ఇటీవల నోటీసులు కూడా జారీ చేసింది. భారీ ఎక్స్‌కవేటర్లు, బుల్డోజర్లు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి శనివారం ఉదయం కూల్చివేతలను ప్రారంభించింది. ‘‘ఐలాపూర్ సర్వే నంబరు 1 నుంచి 220 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయరాదని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాని ని ఏమాత్రం లెక్కచేయకుండా 2006లో ఎంఏ ముఖీం గెస్ట్‌హౌజ్ కట్టాడు. దానితోపాటు 40 ఎకరాల పరిధిలో ఫాంహౌజ్ నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టాడు. అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఆ భూములను తెగనమ్మడం ప్రారంభించాడు. దాంతో, అక్కడ లే అవుట్లు ఉన్నవారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఆ భూముల స్వరూపాన్ని మార్చరాదని ఇరు పక్షాలకూ 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరంతస్తుల అపార్టుమెంటును నిర్మించాడు. ఆ అపార్టుమెంటును హైడ్రా కూల్చివేసింది. స్విమ్మింగ్ పూల్ సహా విలాసవంతంగా నిర్మించుకున్న గెస్టుహౌజ్‌తోపాటు అక్కడ నిర్మించిన ఇంటిని; ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి నిర్మించుకున్న ఫాంహౌజ్‌ను; గుర్రాల కోసం నిర్మించిన శాలలను తొలగించింది’’ అని హైడ్రా తన ట్విటర్ హ్యాండిల్‌లో పెట్టిన ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ ఎంఏ ముఖీం న్యాయవాది బీఆర్‌ఎస్ నాయకు డు కాగా.. స్వయానా ఆయన తమ్ముడు ఎంఏ ఫహీం కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా. ముఖీం సోదరులు ఇక్కడ పాతికేళ్ల కిందటే ఫాంహౌజ్ కట్టుకున్నారు. దాని చుట్టుపక్కల దాదాపు 40 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు.

భూముల అమ్మకాలకు చెక్
కోర్టు తీర్పులు పెండింగ్‌లో ఉండగా ఆ భూమితో ఎటువంటి సంబంధంలేని ముఖీం, అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా పరిగణించిందని హైడ్రా ఆ ప్రకటనలో పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్కచేయకుం డా, ప్లాట్లుగా అమ్మేస్తున్న వారికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి చెక్ పెట్టిందని తెలిపింది. ‘‘చట్టాలంటే భయం లేకుండా, అధికారులను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నిర్వహిస్తున్న ముఖీం కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఖీంకు చెక్ పెట్టింది’’ అని ఆ ప్రకటనలో హైడ్రా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 861 ఎకరాలకు ఫెన్సింగ్ వేయనున్నట్లు తెలిపింది. ఇక, ఐలాపూర్, ఐలాపూర్ తండా గ్రామాల్లో పెద్ద ఎత్తున భూముల్లో పక్కా భవనాలను నిర్మించుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో అమీన్‌పూ ర్, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట గ్రామాల్లో తీవ్ర ఆందోళన లు నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే ఇళ్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్న పేదలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎప్పటికప్పుడు మైకు లో అధికారులు ప్రకటించారు. దాంతో, పేదలంతా ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు సహకరించారు. మరోవైపు, బీరంగూడ, కిష్టారెడ్డిపేట రహదారిపై అసైన్డ్ భూములను లీజులకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. లీజు స్థలాల్లో వేసిన షెడ్లను, దుకాణాలను ఖాళీ చేయించారు. పలు నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వేడుకున్నారు. సామగ్రి తీసుకునే సమయం ఇ వ్వాలని ప్రాథేయపడ్డారు. దాంతో, గంట, రెండు గంట ల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, కిష్టారెడ్డిపేట గ్రామ సర్వే నంబర్ వేసి ఐలాపూర్ గ్రామ భూముల్లో ముఖీం సోదరుడు అజీం ఆరంతస్తుల భవనం నిర్మించి కొందరికి విక్రయించారని అధికారులు ఆరోపిస్తున్నారు. సదరు భవనాన్ని హైడ్రా కూల్చివేసేందుకు వెళ్లగా బాదితులు అడ్డుకుని హైడ్రా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సామగ్రి ఖాళీ చేసి తీసుకుని వెళ్లేందుకు రెండు గంటల సమ యం ఇవ్వడంతో కొందరు బయటకు తెచ్చి కుప్పగా పోసుకున్నారు. మధ్యాహ్నం తరువాత కూల్చివేతలపై హైకోర్టు విధించిన స్టే కాపీ అందడంతో కూల్చివేతలకు హైడ్రా తాత్కలికంగా బ్రేక్ వేసింది.


సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా తీసుకున్న భారీ ఆపరేషన్‌ను రాజగోపాల్‌నగర్ ప్లాట్ల యజమానులు అభినందించారు. టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ‘హైడ్రా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ప్లాట్ల కోసం న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. కోర్టులో విచారణలో ఉండగానే తమ స్థ లాలను ముఖీం కబ్జాలుచేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపించారు. కాగా, హైడ్రా చేపట్టిన కూల్చివేతలను స్వాగతిస్తున్నామని రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు లక్ష్మీనారాయణ, సందీప్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లపై హక్కుల కోసం 42 ఏళ్ల నుంచి తాము న్యాయ పోరాటం చేస్తున్నామని, ఐదుసార్లు యథాతథ స్థితిని కొనసాగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సద రు స్థలాలను విక్రయించారని, వందలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలిపారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని తీర్పులు ఉన్నా పట్టించుకోలేదని తప్పుబట్టారు. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, యథాతథ స్థితిని కొనసాగించాలని 2013లో హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇన్ని సంవత్సరాలకు న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్‌ను అమలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, హైడ్రా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పా రు. ప్రస్తుతం న్యాయస్థానంలో తుది తీర్పు పెండింగ్‌లో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో కానీ కూల్చివేతలను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కూల్చివేతలకు వారం రోజుల ప్రణాళిక
ఐలాపూర్‌లో భారీ ఆపరేషన్‌కు హైడ్రా వారం రోజుల కిందటే ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైడ్రా సిబ్బంది ప్రతిరోజూ ఆక్రమణలకు గురైన స్థలాల వద్దకు చేరుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపారు. ఏయే నిర్మాణాలను తొలగించాలన్న దానిపై స్పష్టతకు వచ్చారు. నిజానికి, ఐలాపూర్‌లోని రాజగోపాల్‌నగర్ లే అవుట్ ప్లాట్ల యజమానులు తమకు న్యాయం చేయాలంటూ గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించారు. వాళ్లు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై విచారణ జరిపారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముఖీం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో వాగ్వాదానికి దిగారు. రాజగోపాల్‌నగర్ ప్లాట్ల యజమానులు సైతం ముఖీంకు వ్యతిరేకంగా హైడ్రాకు పలు మార్లు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 171, 172, 173, 175, 212, 213లోని భూముల్లో ఆయన నిర్మించుకున్న గెస్ట్‌హౌజ్, వ్యవసాయ భూమి సైతం కోర్టు వివాదంలో ఉందని, అది కూడా ప్రభుత్వ స్థలమే అని హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రాజగోపాల్‌నగర్ చెందిన ప్లాట్లను పెద్ద ఎత్తున కబ్జాలు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని హైడ్రా విచారణలో వెల్లడైంది. గత ప్రభు త్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ ఆక్రమణలు వెలిశాయని గుర్తించింది. కేవలం నోటరీ మీదనే దాదాపు వంద ఎకరాల వరకూ అమ్మేశారని హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తక్కువ ధరకు స్థలాలు వస్తున్నందున చాలామంది వీటిని కొనుగోలు చేశారు. అతి తక్కువ మంది అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. దాంతో, ఈ 861 ఎకరాల భూమిలో ఎవరూ ప్లాట్లు కొనవద్దని, ఇప్పటికే ఇక్కడ జరిగిన లావాదేవీలు చెల్లుబాటు కావని హైడ్రా హెచ్చరిక జారీ చేసింది. ఆయా భూముల్లో ఫెన్సింగ్ వేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో విక్రయించిన భూ మాఫియాపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది.
