శివునికి గంజాయి ప్రసాదం.. రంగంలోకి సీపీ సజ్జనార్
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:55 PM
శివరాత్రి పర్వదినం వేళ.. మహాశివునికి గంజాయిని ప్రసాదంగా పలువురు యువకులు సమర్పించారు. అందరూ దేవునికి కొబ్బరికాయ సమర్పిస్తారు. కానీ స్వామి వారికి తాము గంజాయి సమర్పిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. ఈ మొత్తన్ని వారు వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17: శివరాత్రి పర్వదినం వేళ గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. దేవాలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు.. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. సదరు వ్యక్తుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని నేరుగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కి దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సీపీ సజ్జనార్.. వీడియోలోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు గంజాయి బ్యాచ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ధర్మగిరి దేవాలయం వద్ద మహా శివునికి గంజాయిని ప్రసాదంగా పెడుతున్నామంటూ కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవుడికి అందరూ కొబ్బరికాయ కొడితే.. తాము ప్రత్యేకంగా గంజాయి పెడుతున్నామంటూ వీడియోలో వివరించారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు.. నగర సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో వీడియోను పరిశీలించి.. సదరు యువకులు బడంగ్‌పేట్‌కు చెందిన చరణ్‌తోపాటు అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరహా రీల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యువకులను నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News