చంపొద్దు.. ప్లీజ్..!
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:42 AM
వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.
వీధి కుక్కలకు మరణ దండన
నగరంలో బాధితుల విషప్రయోగం
(ఆంధ్రజ్యోతి, అనంతపురం)
వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి. ఎవరికి ఏ హాని తలపెట్టాయోగాని, అనంతపురం నగరంలోని ‘మరణ దండన’ అమలౌతోంది. వీధి కుక్కలు సంచరించే ప్రాంతాలలో కొందరు అదేపనిగా విషాహారాన్ని పడేసి వెళుతున్నారు. వాటిని తిన్న కుక్కలు విలవిలలాడుతూ ప్రాణాలను విడుస్తున్నాయి.
‘అర్ధరాత్రి బాధతో అవి అరిచే అరుపులను వింటే హృదయం ద్రవించిపోతోంది’ అని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని షిరిడీ సాయి నగర్‌కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. వాటిని పట్టుకుంటే జంతు ప్రేమికులకు కోపం.. వదిలేస్తే కుక్కకాటు బాధితులకు కోపం..! అందుకే అధికారులు ‘చర్యలు తీసుకుంటున్నాం..’ అని ప్రకటించి, మధ్యేమార్గంగా చోద్యం చూస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిలన్న ఆలోచన చేయడం లేదు.
కుక్క కరిచేందుకు వస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఆ తరువాత కోపం వస్తుంది. చేతికి దొరికిన రాయి రప్పా విసురుతారు. అవి తగిలి.. ‘కుయ్యో.. కుయ్యో..’ అని అరుచుకుంటూ వెళితే బాధితుల ఇగో శాటి్‌సఫై అవుతుంది. తప్పించుకుని వెళ్లాయో.. ఇక వార్ డిక్లేర్ చేస్తారు. కనిపిస్తే చాలు.. పని మానుకుని, సైలెంట్‌గా దగ్గరకు వెళ్లి చచ్చేలా ఒక దెబ్బ కొడతారు. అది లబోదిబోమని మొత్తుకుంటూ పరిగెడుతుంది. ఇవన్నీ సాధారణంగా జరిగేవే. కానీ, ఇప్పుడు అంతకు మించి..! విషం పెట్టి చంపేస్తున్నారు..! మనుషులతో వాటికేమీ పాత గొడవలు ఉండవు. అయినా ఎందుకో.. వెంటపడి కరుస్తాయి. దాని సైకాలజీని స్టడీ చేసేంత ఓపిక ఎంతమందికి ఉంటుంది..? ‘కుక్కా.. నన్నే కరుస్తావా..? నా మీదకే వస్తావా..?’ అని పగబడుతున్నాం.
కరవడం కుక్క చేసిన తప్పే..! అందుకని వాటిని చంపేయడం వద్దు ప్లీజ్..! మనం మనుషులం కదా..? ఘోరాలు, నేరాలు చేసినవారిలో పరివర్తన రావాలని కోరుకుంటాం. నమ్మక ద్రోహం చేసినా.. వారి పాపాన వారే పోతారులే అని వదిలేస్తాం. కుక్కలు అంతకంటే హీనం కాదు కదా..? ఆలోచించండి ప్లీజ్..! అధికారులు కూడా..!
ఈ వార్తలు కూడా చదవండి:
నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!
ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి
Read Latest Telangana News and National News