Share News

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:38 AM

రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం మండలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

  • తిరుమలలో రాష్ట్రానికి 5 ఎకరాలు కేటాయించండి

  • ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం నిర్మించాలి

  • ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

హైదరాబాద్‌,/భద్రాచలం/అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలం మండలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ప్రజలు పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం తుమ్మల అమరావతిలో చంద్రబాబును కలిశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 5 గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఎంక్లేవ్‌లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని తుమ్మల పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానలోపం, భద్రతా సమస్యలు లాంటి అంశాలు స్థానిక గిరిజనుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించిన కొంత భూభాగం ఏపీ పరిధిలో ఉండటంవల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.


తెలంగాణలోని 2,360 ఎకరాలకు, ఏపీలోని 13,640 ఎకరాలుకు సాగునీరు అందించే ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఏపీ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్‌ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. కరకట్టలోని ఆ భాగం రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. వరదల నుంచి భద్రాచలం రక్షణకు కీలకమైన ఈ కరకట్ట విషయంలో రెండు రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాలని కోరారు. ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భూమి గుర్తింపు పూర్తయిందని, టీటీడీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం భవన నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్‌ నిర్మాణానికి సహకరించాలన్నా. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 17 , 2026 | 06:39 AM