Share News

ఎస్‌ఐ నిర్లక్ష్యంతో అనాథ శవంగా ఖననం

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:19 AM

రిక్షా కార్మికుడి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ‘అదృశ్యం కేసు’ నమోదు చేశారు. కానీ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యంతో..

ఎస్‌ఐ నిర్లక్ష్యంతో అనాథ శవంగా ఖననం

  • సనత్‌ నగర్‌లో నెల తర్వాత వెలుగులోకి

  • దసరా నాడే ట్రాక్‌పై రైలు ఢీ కొని బాలూ నాయక్‌ మృతి

  • అదృశ్యం కేసు నమోదు చేసినా ఎస్‌ఐ నిర్లక్ష్యం

హైదరాబాద్‌ సిటీ/ అమీర్‌పేట, నవంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): రిక్షా కార్మికుడి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ‘అదృశ్యం కేసు’ నమోదు చేశారు. కానీ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యంతో మృతదేహాన్ని అనాథ శవంగా రైల్వే పోలీసులు ఖననం చేసిన అమానవీయ ఘటన నెల రోజుల తర్వాత సనత్‌నగర్‌లో వెలుగు చూసింది. ఫతేనగర్‌ శివాలయం రోడ్డులోని బంజారా బస్తీ నివాసి బాలూ నాయక్‌ (42) రిక్షా కార్మికుడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. గత నెల 20న దసరా రోజు బయటికి వెళ్లిన బాలూ నాయక్‌.. సనత్‌నగర్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. నాంపల్లి రైల్వే పోలీసులు.. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు. మరోవైపు, బాలూనాయక్‌ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు గత నెల 21న సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీంతో వారు ‘అదృశ్యం కేసు’ నమోదు చేసి, లుక్‌ ఔట్‌ నోటీసూ జారీ చేశారు. నాంపల్లి రైల్వే పోలీసులు.. ఆ మృతదేహం తమవద్దే ఉందని, దాన్ని తీసుకెళ్లి.. కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచించినా, సనత్‌ నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ చిరంజీవి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మృతుడి కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. కొద్ది రోజులు వేచి చూసిన నాంపల్లి రైల్వే పోలీసులు.. బాలూ నాయక్‌ మృతదేహాన్ని అనాథ శవంగా ఖననం చేయించారు. మరోవైపు బాలూనాయక్‌ కోసం గాలిస్తుండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు.. బస్తీ వాసులతో కలిసి సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. తక్షణం సనత్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ చిరంజీవిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చర్యలు తీసుకుంటామన్న ఇన్‌స్పెక్టర్‌ హామీ మేరకు వారు శాంతించారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 04:19 AM