Share News

సదర్ మేళా ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:00 PM

సదర్ ఉత్సవ మేళా నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వాహనదారులు పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సదర్ మేళా ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
sadar festival traffic diversions

హైదరాబాద్, నవంబర్ 9: నగరంలోని నారాయణగూడలోని వైఎంపీఏ వద్ద నవంబర్ 10వ తేదీన నిర్వహించనున్న సదర్ ఉత్సవ మేళాను పురస్కరించుకుని.. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.


నవంబర్ 10 రాత్రి 7 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 4 గంటల వరకు నారాయణగూడలోని వైఎంపీఏ వద్ద సదర్ ఉత్సవ మేళాను నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ఉత్సవం సందర్భంగా నారాయణగూడ పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ మేరకు రాంకోటి, లింగంపల్లి, విఠల్‌వాడి, ఆర్టీసీ చౌరస్తాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తామని తెలిపారు.


బర్కత్‌పురా, కాచిగూడ, పోస్ట్ ఆఫీస్ జంక్షన్, క్రౌన్ కేఫ్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్‌- కోటి మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు వైఎంసీఏ, నారాయణగూడ మార్గాలను ఎంచుకోకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు. అలాగే.. బర్కత్‌పురా, పోస్ట్ ఆఫీస్ జంక్షన్, బాగ్ లింగంపల్లి, వీఎస్టీ మీదుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఉంటాయన్నారు. సదర్ మేళాకు వచ్చే సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 09 , 2026 | 08:09 PM