Share News

Hyderabad CP: సైబర్ బాధితులకు అండగా పోలీసులు: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:37 PM

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక విభాగాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లకు చిక్కిన బాధితులకు ఈ సెల్ ఎంతో సహాయంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Hyderabad CP: సైబర్ బాధితులకు అండగా పోలీసులు: సీపీ సజ్జనార్

హైదరాబాద్, జనవరి 09: సైబర్ నేరాల బాధితులకు హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడు అండగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయంలో సైబర్ మిత్ర పేరుతో రూపొందించిన ప్రత్యేక విభాగాన్ని సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు చిక్కిన బాధితులకు ఈ సెల్ ఎంతో సహాయంగా ఉంటుందన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్‌పై హెల్ప్ డెస్క్ ఏర్పాటైందని వివరించారు. సైబర్ క్రైమ్‌ల్లో బాధితుల సంఖ్య పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్ చేయాలని బాధితులకు సూచించారు.


సైబర్ దాడికి గురైతే మ్యూల్ ఖాతాలకు నగదు బదిలీ అయి.. విత్ డ్రా చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్‌కు గురైన వెంటనే గోల్డెన్ అవర్‌ను వినియోగించుకోవాలంటూ బాధితులకు ఆయన కీలక సూచన చేశారు. నేరం జరిగిన గంట లోపు ఫిర్యాదు చేస్తే నగదు ఫ్రీజ్ అవుతుందన్నారు. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేస్తే సరిపోదన్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేయాల్సి ఉందని చెప్పారు. కానీ చాలా మందికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియడం లేదన్నారు.


ఈ నూతన విధానం ద్వారా బాధితులు తమ ఫిర్యాదును పోస్ట్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ద్వారా పంపవచ్చన్నారు. సైబర్ మిత్ర సెల్‌లోని పోలీసులు.. బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు ఎలా రాయాలి? ఏయే సెక్షన్లు వర్తిస్తాయనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా 100 శాతం కేసుల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


ట్రయిల్‌లో భాగంగా 86 మందికి ఫోన్ చేశామని.. వారి నుంచి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సైబర్ నేరానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై తరచూ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ హైదరాబాద్ పోలీసులను నగర సీపీ సజ్జనార్ ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదనే రాజీనామా: జంగా

ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు

For More AP News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 07:34 PM