అడవి జంతువులను వేటాడే ముఠా గుట్టురట్టు.. 70 కేజీల నీల్గాయి మాంసం స్వాధీనం..
ABN , Publish Date - Jul 12 , 2026 | 08:40 PM
అడవి జంతువులను వేటాడి హైదరాబాద్‌లో మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును మల్కాజ్‌గిరి జోన్ పోలీసులు రట్టు చేశారు. శామీర్‌పేటలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బొలెరోలో నీల్గాయి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: అడవి జంతువులను వేటాడి నగరంలో మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును మల్కాజ్‌గిరి జోన్ పోలీసులు రట్టు చేశారు. శామీర్‌పేటలోని బిట్స్ పిలానీ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బొలెరోలో నీల్గాయి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 కిలోల నీల్గాయి మాంసంతో పాటు లైసెన్స్‌డ్ గన్, ఎయిర్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సాల్మన్ రాజ్ అలియాస్ సునీల్, అఖిల్, ఆదినారాయణగా గుర్తించారు.
వారంతా ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో నీల్గాయిని వేటాడి, ఆ మాంసాన్ని హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ పేరుతో పొందిన తుపాకుల లైసెన్సులను దుర్వినియోగం చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శామీర్‌పేట వద్ద తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. వారిపై లైసెన్స్ దుర్వినియోగం, ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ముగ్గురికీ రిమాండ్ విధించింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా అడవి జంతువుల మాంసం కొనుగోలు చేసే వారి గురించీ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి.. భూగర్భ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం