రూ.20 వేలతో మొదలు... రూ.3.73 కోట్లు స్వాహా
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:27 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులపై ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు హస్తినాపురానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మర్యాద రవీందర్ రెడ్డిని రూ.3,73,66,634 మేరకు మోసం చేశారు.
1,107 లావాదేవీల ద్వారా నగదు బదిలీ
జనవరి 4న తొలి చెల్లింపు..
సెప్టెంబర్ 17న వెబ్‌సైట్ మూత
హైదరాబాద్,సెప్టెంబర్27(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులపై ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు హస్తినాపురానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మర్యాద రవీందర్ రెడ్డిని రూ.3,73,66,634 మేరకు మోసం చేశారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే రవీందర్ రెడ్డికి గత ఏడాది డిసెంబర్‌లో పెట్టుబడులకు సంబంధించిన ఓ ప్రకటన లింక్ వచ్చింది. దానిని రవీందర్ రెడ్డి ఓపెన్ చేసిన వెంటనే... జోషి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి స్వల్పకాలంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు.
జోషి చెప్పిన విధానం, అతను సూచించిన వెబ్‌సైట్లను నమ్మిన రవీందర్ రెడ్డి ఈ ఏడాది జనవరి 4న రూ.20 వేల తొలి చెల్లింపుతో పెట్టుబడులు ప్రారంభించారు. తన పెట్టుబడితో పాటు బోనస్ కనిపిస్తూ ఉండటంతో పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లారు. విత్ డ్రా చేసుకుందామని ఆ వెబ్‌సైట్ చాట్‌బాట్‌ను అడిగితే బోనస్ భారీగా తగ్గుతుందని చెప్పడంతో... లాక్‌ఇన్ పీరియడ్ కోసం రవీందర్ రెడ్డి వేచి చూస్తూ తనకున్న అన్ని బ్యాంకు ఖాతాల నుంచి 1,107 లావాదేవీల ద్వారా మొత్తం రూ.3.73 కోట్లకు పైగా ఆ కంపెనీకి పంపారు.
చివరకు సెప్టెంబర్ 17న వెబ్‌సైట్ ఒక్కసారిగా పనిచేయడం నిలిచిపోయింది. కొద్దిరోజులు ఎదురుచూసిన రవీందర్ రెడ్డి తాను భారీ మోసానికి గురైనట్లు గుర్తించారు. దీంతో జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌ను ఆశ్రయించారు. మరోవైపు బాధితుడు పంపిన నగదు చేరిన ఖాతాల్లోని మొత్తాలను నిందితులు ఎప్పటికప్పుడు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. ఈక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో తాజాగా రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహా బౌద్ధ స్థూపానికి పర్యాటక శోభ
Read Latest AP News And Telangana News And International News And Telugu News