ప్రభుత్వ బడుల్లో కృత్రిమ మేధ
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:21 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను పరిచయం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఉన్నత తరగతుల్లో టెక్నాలజీ పాఠాలు
ప్రభుత్వాన్ని ప్రేమించండి.. భయపెట్టొద్దు
ఎస్టీయూ 80వ ఆవిర్భావ దినోత్సవంలో శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మన్సూరాబాద్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను పరిచయం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇప్పుడు విద్యార్థులకు డిగ్రీలోనో బీటెక్‌లోనో పాఠ్యాంశాలు మారిస్తే సరిపోదని.. పాఠశాల స్థాయి నుంచే టెక్నాలజీ పాఠాలు ఉండాలని, వారికి ఏఐపై నైపుణ్యాలు పెంచాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీ యూ) 80వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీని విద్యార్థులకు బోధించేందుకోసం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన ఎస్టీయూ.. ఉపాధ్యాయుల హక్కుల కోసం తన ప్రజాస్వామిక గళాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన బదిలీలు, పదోన్నతులు చేశామని, మెగా డీఎస్సీ నిర్వహించడంతో పాటు అప్‌గ్రేడేషన్ పూర్తి చేశామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటూ సమస్యలను పరిష్కరిం చే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులను అమలు చేశామని, ఏమైనా లోపాలున్నా వాటిని సరిచేస్తామన్నారు. డీఏ, పీఆర్సీ అంశాల్లో వేగవంతమైన కదలిక ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రేమించాలని భయపెట్టవద్దని శ్రీధర్‌బాబు కోరారు. ఎస్టీయూ అధ్యక్షుడు సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహా బౌద్ధ స్థూపానికి పర్యాటక శోభ
Read Latest AP News And Telangana News And International News And Telugu News