Share News

మెట్రో రుణంపై కదలిక!

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:07 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు విషయంలో కీలక అడుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలమై.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచే రుణం వచ్చేందుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది.

మెట్రో రుణంపై కదలిక!

  • మొదటి దశ టేకోవర్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి అందనున్న రుణం!

  • డిసెంబరు చివరికల్లా రూ.13,600 కోట్లు వచ్చేలా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం కీలక చర్చలు.. జనవరిలో మెట్రో రెండో దశ పనులు

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు విషయంలో కీలక అడుగుపడనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలమై.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచే రుణం వచ్చేందుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది. డిసెంబరు చివరినాటికి రూ.13,600 కోట్ల రుణం ప్రభుత్వానికి అందుతుందన్న అంచనాలు ఉన్నాయని సమాచారం. ఇందుకు అవసరమైన ప్రక్రియను ప్రభుత్వం దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో మెట్రో రుణంపై కీలక చర్చలు జరిపారని, వాటి ఫలితంగానే ఈ వ్యవహారం కొలిక్కి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.


ఈ నేపథ్యంలో మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణలో జాప్యానికి ప్రభుత్వం తెరదించనుంది. జనవరిలో మెట్రో రెండో దశ పనులు ప్రారంభించేలా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ ద్వారా తమకు ఆశించిన ఫలితాలు రాలేదని, నష్టాలు వచ్చాయని నిర్వహణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రభుత్వానికి చెప్పడం తెలిసిందే. రెండో దశ చేపట్టాలంటే సాంకేతికంగా మొదటి దశను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. దాంతో ఫేజ్‌-1 టేకోవర్‌కు రూ.13,600 కోట్లు కావాల్సి వచ్చింది. ప్రభుత్వం అన్ని ప్రక్రియలు పూర్తి చేయడంతో ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి తక్కువ వడ్డీకే ఆ రుణం వచ్చింది. కానీ చివరి దశలో నిధుల విడుదల నిలిచిపోయింది. ఈ క్రమంలో జూన్‌లో సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రుల మధ్యన చర్చలు జరిగాయి.


అయితే అప్పటికే జపాన్‌కు చెందిన సంస్థ నుంచీ మంజూరైన రుణ ప్రక్రియ నిలిచిపోయింది. దాంతో రెండు దశలకు విడివిడిగా కాకుండా కలిపే రుణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయి. కేంద్రం ఆశించినస్థాయిలో సహకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు చర్యలు మొదలుపెట్టింది. నాలుగు శాతం వడ్డీకి రుణం కోసం అన్వేషిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచే రుణం వచ్చేందుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది. ఆ రుణం డిసెంబరు చివరి నాటికి అందుతుందని అంచనా. ఒకవేళ ఆశించిన సమయానికి రాకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని సమాచారం.


మెట్రో స్వాధీనానికి అవసరమైన నిధులను ఇప్పటికే మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి బ్రిడ్జి లోన్‌ విధానంలో నిధులు సమీకరించి పెట్టుకుందని తెలిసింది. మొదటి సంస్థ నుంచి రుణం అందాక ఈ బ్రిడ్జి లోన్‌ను తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. బ్రిడ్జి లోన్‌ విధానం అంటే స్వల్పకాలిక రుణంలాంటిది. ఈ విధానంలో ఒక సంస్థ నుంచి నిధులు సమీకరించుకుని, అత్యవసర చెల్లింపులు చేసి, ఆ తర్వాత తమకు రావాల్సిన రుణం అందాక వాటిని బ్రిడ్జి లోన్‌ ఇచ్చిన సంస్థకు చెల్లిస్తారు. ఈ విధానంలో వడ్డీ సాధారణం కంటే కొంత ఎక్కువ ఉంటుంది. స్వల్పకాలిక విధానంలో తీసుకునే రుణం కాబట్టి పెద్దగా వడ్డీ భారం ఉండదని, పైగా మెట్రో ప్రాజెక్టులో కీలక అడుగు పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్

Updated Date - Nov 30 , 2026 | 03:11 AM