కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థి స్పాట్ డెడ్
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:50 PM
హైదరాబాద్ కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నియోపోలిస్ వద్ద ఇన్నోవా క్రిస్టా కార్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్,సెప్టెంబర్13: నగరంలోని కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నియోపోలిస్ వద్ద ఇన్నోవా క్రిస్టా కార్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మదన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మదన్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరంతా హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్నారని పోలీసులు వివరించారు. శనివారం స్నేహితుడు తమన్ వర్మ పుట్టిన రోజు వేడుకలను మియాపూర్‌లో ఈ 8 మంది విద్యార్థులు జరుపుకున్నారని తెలిపారు.
అనంతరం వారంతా ఇన్నోవా క్రిస్టా కారులో లాంగ్ డ్రైవ్ కోసం మియాపూర్ నుంచి కోకాపేట్‌లోని నియో పోలీస్‌కి బయలుదేరారని పేర్కొన్నారు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణించిన వారంతా ఇంటర్ విద్యార్థులేనని.. మైనర్లని పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు నార్సింగ్ పోలీసులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
మాపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు: కొండా సురేఖ
For More TG News And Telugu News