అండాల విక్రయం కేసులో 17కు చేరిన అరెస్టులు
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:39 AM
అండాల విక్రయం కేసులో అరెస్టుల సంఖ్య 17కి పెరిగింది. సద్గురు హెల్త్‌కేర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) ఆశిష్ అగర్వాల్ (40), అకౌంటెంట్ రెంటాల శేషగిరి రావు (64)ను సరూర్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
సద్గురు సీఎఫ్ఓ, అకౌంటెంట్‌తో పాటు
కీలక నిందితురాలి అరెస్టు.. ఆర్థిక లావాదేవీలపై ఆరా
హైదరాబాద్ సిటీ/మియాపూర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అండాల విక్రయం కేసులో అరెస్టుల సంఖ్య 17కి పెరిగింది. సద్గురు హెల్త్‌కేర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) ఆశిష్ అగర్వాల్ (40), అకౌంటెంట్ రెంటాల శేషగిరి రావు (64)ను సరూర్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ7గా ఉన్న గేదెల గాయత్రి(31)ని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. సద్గురు హెల్త్‌కేర్ హైదరాబాద్ సీఓఓ.. ముంబైకి చెందిన ప్రతీక్ అనిల్ గంగ్లా, ఒయాసిస్ ఫర్టిలిటీ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ అసోంకు చెందిన డాక్టర్ రాజశ్రీ దేబ్‌ను శనివారం అరెస్టు చేశారు. ఈ ఐదు అరెస్టులతో కలిసి ఈ కేసులో ఇప్పటిదాకా అయిన అరెస్టుల సంఖ్య 17కి పెరిగింది. సీఎఫ్ఓ ఆశిష్ అగర్వాల్, అకౌంటెంట్ శేషగిరిరావును అరెస్ట్ చేసిన సరూర్‌నగర్ పోలీసులు వారి వద్ద నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
సద్గురు ఫర్టిలిటీ కేంద్రాల నుంచి వచ్చే డబ్బును అశిష్ అగర్వాల్ ఇతర మార్గాల ద్వారా బదిలీ చేయడం చేసేవాడని, సూర్యకిరణ్, దుర్గారావులతో కలిసి గాయత్రి మదీనగూడ, మియాపూర్‌లో ఒయాసిస్, సద్గురు హెల్త్ కేంద్రాన్ని నిర్వహించేదని, అండాల సేకరణలో వీరిది కీలక పాత్రని పోలీసు దర్యాప్తులో తేలింది. వీరు అండాలు ఇచ్చిన మహిళలకు రూ.50 వేలు చొప్పున, మధ్యవర్తులకు రూ.90 వేల నుంచి లక్ష వరకు చెల్లించేవారని పోలీసులు గుర్తించారు. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. అక్రమ అండాల మాటున రూ.487 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన పోలీసులు నిందితుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. కాగా, కేసులో ప్రధాన నిందితులు అమిత్‌శర్మ, నిఖత్ పర్వీన్ అలియాస్ నిఖత్‌శర్మ, ఎమిరిషెట్టి దుర్గాప్రసాద్‌లను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆర్థిక అంశాలపై లోతుగా ప్రశ్నించి సమాచారం సేకరిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్