Share News

ఫర్టిలిటీ వైద్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:48 AM

అక్రమ అండాల రాకెట్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలు ఫర్టిలిటీ సెంటర్లకు చెందిన డాక్టర్లకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తిగిలింది.

ఫర్టిలిటీ వైద్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసిన ధర్మాసనం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అక్రమ అండాల రాకెట్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న పలు ఫర్టిలిటీ సెంటర్లకు చెందిన డాక్టర్లకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తిగిలింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు సోమవారం డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, బీహార్‌ తదితర రాష్ర్టాల నుంచి వివాహం కాని యువతులను తీసుకొచ్చి హాస్టళ్లలో ఉంచి అక్రమంగా హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్న వ్యవహారంలో హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్లలో వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయం తెలిసిందే.


ఈ ఎఫ్‌ఐఆర్‌లలో తమను అక్రమంగా ఇరికించారని తాము ఏఆర్‌టీ యాక్ట్‌- 2021 నిబంధనల ప్రకారమే వ్యవహరించామని పేర్కొంటూ పద్మజా ఫర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్‌ పద్మజ, ఒయాసిస్‌ ఫర్టిలిటీ సెంటర్‌కు చెందిన గడల దుర్గ తదితరులు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముందస్తు బెయిల్‌ పిటిషన్లలో సాధారణంగా కోర్టు పరిధి పరిమితంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయి. ఈ దశలో జోక్యం చేసుకోలేం’ అని ధర్మాసనం పేర్కొంది. కొంతమంది డాక్టర్లు తమ తమ ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా అక్రమ అండాల సేకరణ రాకెట్లను నడుపుతుండటంపై ధర్మాసనం దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 05:48 AM