Share News

ఇరుకిరుకు గల్లీలు.. పెద్దపెద్ద మేడలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:06 AM

హైదరాబాద్‌ సిటీ: ఓవైపు ఏడంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయినా.. మరోవైపు అక్రమ భవనాలను కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడంలేదు. అతి తక్కువ స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

ఇరుకిరుకు గల్లీలు.. పెద్దపెద్ద మేడలు
Iruku Gallilu

  • అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌లో 5 నుంచి 7

  • అంతస్తులతో 50కి పైనే నిర్మాణాలు!

  • అన్ని భవనాలూ 50 నుంచి 120 గజాల విస్తీర్ణంలోనే

  • అందులో 60-70 శాతం భవనాలు 75 గజాలలోపే

  • జీ ప్లస్‌ 2కి మించి నిర్మించొద్దన్న నిబంధన బేఖాతరు

  • ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బట్టబయలు

  • 10-15 అడుగుల వెడల్పు రోడ్లలోనే భారీ భవనాలు

  • నోటీసులకే పరిమితమవుతున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ: ఓవైపు ఏడంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయినా.. మరోవైపు అక్రమ భవనాలను కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడంలేదు. అతి తక్కువ స్థలంలోనే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌లలో ఏకంగా 50కి పైగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నీ 5 నుంచి 7 అంతస్తుల వరకు నిర్మిస్తున్న భవనాలే ఉన్నాయి. వీటన్నింటినీ 60 నుంచి 120 గజాలలోపు స్థలంలోనే నిర్మిస్తున్నారు. వీటిలోనూ 60-70 శాతం దాకా భవనాలు 75 గజాల లోపువే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అంతర్గత రహదారులు కేవలం 10 నుంచి 15 అడుగుల వెడల్పుతోనే ఉన్నాయి. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధుల బృందం జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 50కి పైగా భవనాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నిర్మాణాలకు సంబంధించిన లైవ్‌ లొకేషన్‌ ఫొటోలను జీపీఎస్‌ కెమెరా ద్వారా తీసినప్పుడు.. ఆయా భవనాల వద్ద కూలీలు పనులు చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పైగా, అక్కడి భవన నిర్మాణదారుల్లో గానీ, పనిచేస్తున్న కూలీల్లో గానీ అక్రమ నిర్మాణానికి సంబంధించిన భయం, ఆందోళన ఏవీ లేకుండా పని చేసుకుంటున్నట్లు వెల్లడైంది. అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌ ప్రాంతాల్లో సుమారు అర కిలోమీటర్‌ నుంచి కిలోమీటర్‌ వ్యాసార్థంలో పరిశీలించినప్పుడు జీ ప్లస్‌ 2 భవనాలు 5శాతానికి మించి లేవు. మిగతావన్నీ (95 శాతం) ఏడు అంతస్తుల భవనాలే కనిపించాయి.


హాస్టళ్ల డిమాండ్‌ పెరగడంతో..

ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉండటంతో అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర వలసదారులకు వసతి అవసరం పెరిగింది. అటు గచ్చిబౌలి-కొండాపూర్‌ పాత ముంబై హవే, మాదాపూర్‌ ఐటీ కారిడార్‌ అయిన టెక్‌ మహీంద్రా ప్రాంతం మధ్యనే ఈ రెండు ప్రాంతాలు ఉండడంతో ఇక్కడ 60 వేల మందికి పైగానే ఉద్యోగులు హాస్టళ్లలో ఉంటున్నారు. దీంతో పీజీలు, హాస్టళ్లకు భారీ డిమాండ్‌ ఏర్పడడంతో చిన్న చిన్న స్థలాలను సైతం వదలకుండా బహుళ అంతస్తుల భవనాలుగా మార్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 50-60-120 గజాల స్థలాల్లో ఏకంగా 5 అంతస్తులకు తగ్గకుండా అత్యధికంగా జీ ప్లస్‌ 7 అంతస్తులు నిర్మించి, అద్దెకు ఇస్తున్నారు. 75 గజాల్లోపు స్థలాలకు మునిసిపాలిటీ అనుమతుల విషయంలో వెసులుబాటు ఉండడంతో.. ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఒకప్పుడు చిన్న నివాస ప్రాంతాలుగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు భారీగా వాణిజ్య, వసతి భవనాలతో నిండిపోతున్నాయి. అయితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించడం వల్ల జనసాంద్రత పెరగడంతోపాటు పార్కింగ్‌, డ్రైనేజీ, విద్యుత్‌, అగ్నిమాపక భద్రత, అత్యవసర రాకపోకలు వంటి అంశాలు తీవ్ర సమస్యగా మారుతున్నాయి.


ఘటన జరిగిన తర్వాత కూడా..

క్షేత్రస్థాయి పరిశీలనలో అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌ పరిధిలోనే 5 నుంచి 7 అంతస్తుల వరకు ఉన్న భవనాలు స్టష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని భవనాలను అనుమతులతో నిర్మించారు? ఎన్ని భవనాలకు అనుమతులకు మించి అంతస్తులు పెంచారు? ఎన్ని భవనాలు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మితమయ్యాయి? అన్న దానిపై సమగ్ర తనిఖీ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలతోపాటు..మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు నోటీసులు జారీచేసినా పను లు ఆగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అంజయ్యనగర్‌లో జరిగిన ఘటనతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తూ.. ఆ తర్వాత పరిస్థితిని నియంత్రించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. అగ్నిప్రమాదం, భవనం కూలిపోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ ఇంజన్లు, అంబులెన్స్‌లు వెళ్లేందుకు కూడా సాధ్యంకాని ఇరుకైన రహదారుల్లో భారీ నిర్మాణాలకు అనుమతులు ఎలా వస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


నోటీసులు ఇవ్వడంతోనే సరి?

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న విషయం క్షేత్రస్థాయిలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు కూడా కనిపిస్తున్నా.. చర్యలు మాత్రం నోటీసులకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నిర్మాణం ప్రారంభ దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు.. భవనం పూర్తయ్యేవరకు వేచి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత చర్య లు తీసుకోవడం కంటే.. పునాది దశలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. పైగా, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే నచ్చినన్ని అం తస్తులు నిర్మించుకునేందుకు అనధికారికంగా సహకరిస్తున్నారని అంటున్నారు. వీరికి కొందరు రాజకీయ నేత ల అండదండలూ ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.

రేపటి ప్రమాదాన్ని ఇప్పుడే ఆపాలి..

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న అంజయ్యనగర్‌, సిద్దిక్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో నిర్మాణాలపై ఇప్పటికైనా సమగ్ర సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతి భవనానికీ అనుమతులు ఉన్నాయా? అనుమతించిన విస్తీర్ణం ఎంత? నిర్మించిన అంతస్తులు ఎన్ని? ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? అత్యవసర వాహనా లు వెళ్లేందుకు మార్గం ఉందా? అన్న అంశాలను పరిశీలించాలని అంటున్నారు. అక్రమ నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూల్చివేతలు చేపట్టడం కంటే.. నిర్మాణం మొదలైన దశలోనే అడ్డుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలను కూడా చదవండి

ఆరోగ్యం డిజిటల్‌..!ఆరోగ్యం డిజిటల్‌..!

కనకమహాలక్ష్మి ఆలయంలో ఎవరికి వారే యమునా తీరే!!

Updated Date - Aug 25 , 2026 | 04:11 AM