Share News

కనకమహాలక్ష్మి ఆలయంలో ఎవరికి వారే యమునా తీరే!!

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:14 AM

కనకమహాలక్ష్మి ఆలయంలో పరిపాలన సరిగ్గా సాగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది.

కనకమహాలక్ష్మి ఆలయంలో  ఎవరికి వారే యమునా తీరే!!

సెలవులో ఈవో

దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు

ఏసీఓ, సూపరింటెండెంట్‌ కూడా సెలవులోనే...

ఇష్టారాజ్యంగా ట్రస్ట్‌ బోర్డు నిర్ణయాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కనకమహాలక్ష్మి ఆలయంలో పరిపాలన సరిగ్గా సాగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శోభారాణి నెల రోజుల నుంచి సెలవులో ఉన్నారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ సుజాతకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆమె రెండు బాధ్యతలు నిర్వహించడం కొంత ఇబ్బందిగా ఉంది. రెండు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఏఈఓలు) పోస్టులు ఉండగా నాలుగు నెలల క్రితం ఒకరు (ఆనందకుమార్‌) పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఒక్కరు (రాజేంద్రకుమార్‌) మాత్రమే ఉన్నారు. ఆయన విధులకు సరిగా హాజరు కారు. ఈ కారణంగా ఆయనపై గతంలో చర్యలు తీసుకున్నారు. గతంలో సింహాచలం దేవస్థానంలో పనిచేస్తుండగా, భరించలేక విజయవాడ బదిలీ చేశారు. అక్కడ కొద్దికాలమే పనిచేసి విశాఖలో కనకమహాలక్ష్మి ఆలయానికి డిప్యూటేషన్‌పై వచ్చేశారు. ఇటీవల ఆయన వేధింపులు ఎక్కువ కావడంతో ఆలయ సిబ్బంది అంతా కలిసి ఇన్‌చార్జి ఈఓ సుజాతకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. సెప్టెంబరు రెండో తేదీతో ఆయన డిప్యూటేషన్‌ ముగిసిపోతుంది. వెనక్కి పంపించేస్తారు. కొత్త ఏఈఓ రావలసి ఉంది. ఇకపోతే ఆలయ సూపరింటెండెంట్‌ ఏఈఓగా పదోన్నతికి యత్నిస్తున్నారు. అందుకని సెలవు పెట్టేశారు. దీంతో ఈఓకు సహాయంగా అధికారులు లేకుండా పోయారు.

ఆదేశాలు లేకుండానే...

దేవస్థానం ట్రస్ట్‌ బోర్టు చైర్మన్‌ కందుల నాగరాజు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ట్రస్టు బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మార్గశిర మాసంలో అంబికాబాగ్‌ నుంచి కనక మహాలక్ష్మి ఆలయం వరకు నిర్వహించే రథయాత్రలో కలశాలతో మహిళలను ఊరేగింపుగా తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనికి బోర్డు ఆమోదం తెలిపింది. ఆ యాత్రలో పాల్గొనే వారికి రూ.200 టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను ఈఓ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయానికి రాసి, అక్కడి నుంచి ఆమోదం వచ్చాక ఆన్‌లైన్‌లోనే టికెట్లు విక్రయించాలి. కానీ ఇదేమీ లేకుండా చైర్మన్‌ కరపత్రాలు వేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఈఓ సుజాత వెంటనే ఆ ప్రచారం ఆపాలని సోమవారం ఆదేశించారు. ఇదే విషయం కమిషనర్‌కు లేఖ రాశారు. రథయాత్ర టికెట్ల విక్రయానికి అనుమతి ఇస్తే ముందుకు వెళతామని పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి వచ్చేంత వరకు దీనిపై ఎటువంటి టికెట్ల విక్రయం, ప్రచారం చేయబోమని స్పష్టంచేశారు.

28న ఈఓ రాక

ఇదిలావుండగా సెలవులో వెళ్లిన ఈఓ శోభారాణి ఈ నెల 28న మళ్లీ విధుల్లో చేరే అవకాశం ఉందని తెలిసింది. ఆమె వస్తే అన్ని సర్దుకుంటాయని సిబ్బంది చెబుతున్నారు. ఆమెకు ఇంకా ఐదు నెలల సర్వీస్‌ ఉంది. జనవరి చివర్లో పదవీ విరమణ చేస్తారు.


గ్రేటర్‌ ఎన్నికలపై వైసీపీ కసరత్తు

నియోజకవర్గ సమన్వయకర్తలతో నేడు జగన్‌ భేటీ

మేయర్‌ అభ్యర్థిగా చర్చించే అవకాశం

ఆశావహుల జాబితాలో కేకే రాజు, తైనాల, వాసుపల్లి, జియ్యాని...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో సమర్థుడైన అభ్యర్థిని గుర్తించే పనిలో అఽధిష్ఠానం ఉంది. రిజర్వేషన్‌కు అనుగుణంగా అన్ని విధాలుగా సమర్థులైన అభ్యర్థులను ఇప్పటి నుంచే గుర్తించేందుకు నగర పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో విజయవాడలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగడం తథ్యమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే మేయర్‌ పదవికి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రకటించారు. మరోవైపు అవకాశం వస్తే పోటీకి సిద్ధమని పార్టీ నగర అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌, రిజర్వేషన్‌లు తమకు అనుకూలిస్తే పోటీకి దిగాలని మాజీ డిప్యూటీ మేయర్‌లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌ వంటివారు తమ అనుచరులు, పార్టీ నేతల వద్ద తమ మనసులోమాటను బయటపెడుతున్నారు.

పార్టీ నేతలతో నేడు వైఎస్‌ జగన్‌ భేటీ

జీవీఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం దూకుడు, తమ పార్టీ నేతల కుతూహలాన్ని గుర్తించిన వైసీపీ అఽద్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జీవీఎంసీ పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలతో మంగళవారం తాడేపల్లిలో సమావేశం ఏర్పాటుచేశారు. పార్టీ సమన్వయకర్తలతోపాటు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా విజయవాడ బయలుదేరి వెళ్లారు. రిజర్వేషన్‌కు అనుగుణంగా సమర్థులైన నేతలను ముందుగానే గుర్తించాలని పార్టీ అధ్యక్షుడు భావిస్తున్నందున దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. మరోవైపు జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితి, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, తదితర అంశాలపై ఆరా తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. మేయర్‌ పదవికి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న నేతలు తమ మనసులోని మాటను పార్టీ అధ్యక్షుడికి తెలియజేసే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.


అప్పన్నకు రూ.2.11 కోట్ల ఆదాయం

సింహాచలం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 21 రోజుల్లో హుండీల ద్వారా సమర్పించిన కట్నకానుకలు, మొక్కుబడుల రూపేణా రూ.2.11 కోట్ల ఆదాయం సమకూరింది. ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో సోమవారం పరకామణి కేంద్రంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. ఇందులో రూ.2,11,97,273 నగదు, 60 గ్రాముల స్వర్ణం, 5.025 కిలోల రజితం ఆభరణాల రూపంలో లభించాయి. ఇంకా 201 యూఎస్‌ డాలర్లు, 1420 సౌదీ అరేబియా కరెన్సీ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సింగపూర్‌, యూఏఈ, ఖతార్‌, ఫ్రాన్స్‌, టర్కీ, చైనా, కువైట్‌, తదితర దేశాల కరెన్సీ అప్పన్న ఖజానాకు సమకూరింది. హుండీల లెక్కింపులో స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానంలోని పలు విభాగాల ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 01:14 AM