స్కూటీని ఢీకొన్న కారు.. అక్కాతమ్ముళ్ల మృతి
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:22 AM
బతుకమ్మ పండగ పూట హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కూతురుతో కలిసి పండగకు పుట్టింటికి బయలుదేరిన ఓ మహిళను, తన చిన్నమ్మ కొడుకును కారు రూపంలో మృత్యువు కబలించింది.
బాలికకు తీవ్ర గాయాలు.. పండగకు పుట్టింటికి
వస్తుండగా హయత్‌నగర్ వద్ద ప్రమాదం
హయత్‌నగర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండగ పూట హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల కూతురుతో కలిసి పండగకు పుట్టింటికి బయలుదేరిన ఓ మహిళను, తన చిన్నమ్మ కొడుకును కారు రూపంలో మృత్యువు కబలించింది. స్కూటీపై వెళ్తున్న వారిని ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కాతమ్ముళ్లు ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
శంషాబాద్ మండలం సుల్తాన్‌పేట్‌కు చెందిన రేఖ (34) తన మూడేళ్ల కూతురు చార్వికతో కలిసి పెద్దఅంబర్‌పేట్‌లోని తన పుట్టింటికి ఆదివారం ఉదయం బయలుదేరింది. బస్సులో ఎల్‌బీనగర్‌కు చేరుకున్న ఆమె.. అక్కడ తన చిన్నమ్మ కొడుకు ఏదుల నవీన్ (25) స్కూటీ ఎక్కింది. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో నవీన్ స్కూటీని ఓ డీసీఎం వ్యాను వెనుక నిలిపాడు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన ఓ మహీంద్రా కారు.. స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్య నలిగిపోయి రేఖ, నవీన్ అక్కడిక్కడే మృతి చెందారు.
బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. ప్రమాదం జరగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తారనుకునేలోపే ఆ దేవుడు తన కుమార్తెను, చెల్లెలు కొడుకును దూరం చేశాడంటూ పోలీ్‌సస్టేషన్ వద్ద మృతురాలి తల్లి సువర్ణ రోదనలు అందరినీ కలిచివేశాయి. రేఖ తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International