Share News

జిమ్‌లలో స్టెరాయిడ్ అక్రమ వినియోగం.. సీపీకి ఎమ్మెల్యే లేఖ

ABN , Publish Date - Jun 12 , 2026 | 07:39 PM

హైదరాబాద్ నగరంలోని జిమ్‌లలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు.

జిమ్‌లలో స్టెరాయిడ్ అక్రమ వినియోగం.. సీపీకి  ఎమ్మెల్యే లేఖ

హైదరాబాద్, జూన్12: మహానగరంలోని జిమ్‌లలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగర సీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. త్వరగా కండలు పెంచుకోవాలని యువతను కొందరు ట్రైనర్లు, కోచ్‌లు ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఇంజెక్షన్ల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమన్నారు. ఇలాంటి జిమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నగర సీపీని గోషామహల్ ఎమ్మెల్యే కోరారు.


జిమ్‌లలో అనాబాలిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం, వినియోగం వేగంగా పెరుగుతోందని రాసిన లేఖలో ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఇది యువత ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని తెలిపారు. స్టెరాయిడ్‌ల వాడకం వల్ల గుండె, కాలేయం, హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కొందరు జిమ్ నిర్వాహకులు, ట్రైనర్లు అక్రమంగా ఈ ఇంజెక్షన్ల సరఫరాలో పాల్గొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ లేఖ ద్వారా తీసుకెళ్లారు.


నగరంలోని జిమ్‌లపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించాలని సీపీకి గోషా మహాల్ ఎమ్మెల్యే సూచించారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ల సరఫరా, పంపిణీ చేస్తున్న వారిని గుర్తించాలన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడే నిందితులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యువతకు స్టెరాయిడ్‌ల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. అక్రమ స్టెరాయిడ్ మాఫియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. యువత ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ఆ లేఖలో సీపీ సజ్జనార్‌కు ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మసూద్ చాంది హత్య.. నిందితుల కోసం గాలింపు

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 07:52 PM