Share News

జీసీసీ మెరుపుల వెనుక ఒత్తిళ్లెన్నో!

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:00 AM

ఆఫీసులోకి అడుగుపెడితే.. కళ్లముందు మరో ప్రపంచం కనిపిస్తుంది. మెరిసిపోయే ఇంటీరియర్లు... కవ్వించే కేఫెటేరియాలు! ఫిట్‌నె్‌సను గుర్తుచేసే జిమ్‌లు.. సత్తా చూపాలంటూ సవాల్‌ విసిరే గేమింగ్‌ జోన్లు!! అన్నింటికీ మించి..

జీసీసీ మెరుపుల వెనుక ఒత్తిళ్లెన్నో!
Hyderabad GCC jobs

  • రూ.లక్షల్లో జీతాలు..

  • అడుగడుగునా సౌకర్యాలు

  • పనివేళలు మాత్రం 12 నుంచి 15 గంటలు

  • ఎప్పుడెవరి కొలువు పోతుందో తెలియని పరిస్థితి

  • కాల్‌ అండ్‌ కట్‌, పీఐపీ అంటూ నిశ్శబ్ద కోతలు

  • హైదరాబాద్‌లోని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో

  • కష్టాల గురించి చెప్పుకొని

  • వాపోతున్న ఉద్యోగులు

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

ఆఫీసులోకి అడుగుపెడితే.. కళ్లముందు మరో ప్రపంచం కనిపిస్తుంది. మెరిసిపోయే ఇంటీరియర్లు... కవ్వించే కేఫెటేరియాలు! ఫిట్‌నె్‌సను గుర్తుచేసే జిమ్‌లు.. సత్తా చూపాలంటూ సవాల్‌ విసిరే గేమింగ్‌ జోన్లు!! అన్నింటికీ మించి.. అంతర్జాతీయ ప్రమాణాలతో తులతూగే వర్క్‌స్పే్‌సలు. చూడగానే ఇలాంటి చోట ఉద్యోగంలో చేరాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఇదీ.. రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో కనిపించే వాతావరణం! ఆరంకెల జీతాలు.. సకల సౌకర్యాలు ఉన్న అలాంటి ఉద్యోగంలో చేరాలని ఎవరికైనా అనిపించడం సహజమే. కానీ.. వాటిలో ఉద్యోగాలు చేస్తున్నవారిని కదిపితే మాత్రం ఆ మెరుపుల వెనుక ఉన్న చీకట్ల గురించి, తాము ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి గంటల కొద్దీ ఏకరువు పెడతారు. ‘‘రేపు కూడా ఇదే సీట్లో నేను కూర్చుంటానా?’’ అనే భయం అనుక్షణం వెంటాడుతుందని వాపోతారు. రుజువులు కావాలా? రెడిట్‌లాంటి వెబ్‌సైట్లలోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని జీసీసీల్లో పనిచేసేవారు పెట్టిన బోలెడన్ని పోస్టులు కనపడతాయి.


దేశంలో ఫార్మా రంగానికి కేంద్రంగా మారిన మన భాగ్యనగరం.. ఇటీవలికాలంలో ప్రపంచ ప్రసిద్ధ కంపెనీల గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు హబ్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో 516కు పైగా జీసీసీలు, వాటిలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నట్లు ఫిక్కీ-అన్‌రాక్‌ నివేదిక వెల్లడించింది. వాటిల్లో భారీ జీతాలతో నియామకాలు జరుగుతున్నాయి. కొత్త కంపెనీలు, ఉద్యోగాలు వస్తున్నాయన్నది నిజమేగానీ.. వాటిల్లో పనిచేస్తున్న తమపై నిరంతరం ఒత్తిళ్లు ఉంటున్నాయని, కొలువుల విషయంలో ఎప్పుడూ అనిశ్చితి రాజ్యమేలుతూ ఉంటోందని ఉద్యోగులు వాపోతున్నారు. తమ కష్టాల గురిం చి.. గ్లాస్‌డోర్‌, రెడిట్‌, బ్లైండ్‌ సహా పలు వెబ్‌సైట్లు, యాప్‌ల్లో చెప్పుకొని మనసులో భారం కొంతైనా దించుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీసీసీల మెరుపుల వెనుక ఉన్న చేదు నిజాలను చూడాలని.. వాటిల్లో నిత్యం జరిగే నిశ్శబ్ద(ఉద్యోగ) కోతలు తమ ను నిస్పృహలోకి నెట్టేస్తున్నాయని చెబుతున్నారు.


ఉన్నట్టుండి పొమ్మంటారు..

ఒకప్పుడు ఆఫీస్‌ అంటే పని చేసే చోటు మాత్రమే! కానీ జీసీసీలో అడుగుపెడితే.. తినడానికి తిండి, ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌, విశ్రాంతి కోసం పాడ్స్‌, మరీ బోర్‌ కొడితే రిక్రియేషన్‌ అన్నీ ఉంటాయి. కానీ.. ఉద్యోగమే ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. అప్పటి వరకూ టీమ్‌లో కీలకంగా ఉన్న ఉద్యోగి.. అంతలోనే ఆఫీసులో కనిపించకపోవచ్చు. అదేంటని అడిగితే.. రీ-ఆర్గనైజేషన్‌... బిజినెస్‌ రిక్వైర్‌మెంట్‌.. ఫెర్‌ఫార్మెన్స్‌... లాంటి అందమైన పదాలను ఉపయోగించి వాళ్లని తీసేసినట్టు చెబుతారు. అలాగని అన్ని జీసీసీలలో, అందరు ఉద్యోగులకూ ఇలాగే జరుగుతుందని కాదుగానీ.. కొన్ని జీసీసీల్లో, కొందరి పరిస్థితి ఇదేనని గ్లాస్‌డోర్‌లాంటి వెబ్‌సైట్‌లలో జీసీసీల ఉద్యోగులు ఏకరువు పెడుతున్న బాధల గురించి చదివితే అర్థమవుతుంది.


జీసీసీలలో వర్క్‌కల్చర్‌ గురించి కొంతమంది ఉద్యోగులు గొప్పగా చెబుతుంటే.. నిశ్శబ్ద కోతలు, అధిక పనివేళలు, క్లయింట్స్‌ ఒత్తిళ్ల గురించి మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఉదాహరణకు.. రెడిట్‌ వెబ్‌సైట్‌లో ఓ ఉద్యోగి (తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదాయన) తన అనుభవాన్ని ఇలా చెప్పారు. ‘‘ఎంఎన్‌సీలో ఉద్యోగం వదిలి జీసీసీలో మంచి భవిష్యత్‌ ఉంటుందని ఉద్యోగంలో చేరాను. ఓ నెల తరువాత టీమ్‌ మీటింగ్‌ అన్నారు. చర్చలేదు. ఫీడ్‌బ్యాక్‌ లేదు. హెచ్చరిక అసలే లేదు. ‘నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాం’ అని ఆ మీటింగ్‌లో నాకు చెప్పారు (ఇలా తీసేయడాన్ని కాల్‌ అండ్‌ కట్‌ విధానం అంటారు). రెండే లైన్ల ఎక్స్‌పీరియన్స్‌ లెటర్‌ మాత్రమే ఇచ్చారు’’ అని వాపోయారు. ఇది అతనొక్కడి అనుభవమే కాదు. అలాంటివారు చాలా మందే ఉంటున్నారు. పీఐపీ (పెర్‌ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌)లో పెట్టి టీమ్‌ మొత్తాన్నీ తీసేస్తున్నారని చెబుతున్నారు.


పీఐపీలో పెట్టారంటే మన ఉద్యోగం ఊడుతుందనే అర్థమని ఒక ఉద్యోగి గ్లాస్‌డోర్‌లో తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. తాను రెండేళ్ల నుంచి ఒక జీసీసీలో చేస్తున్నానని.. జీతాలు పెంచాల్సిన సమయంలో ‘మీ ఫెర్‌ఫార్మెన్స్‌ బాగోలేదు, పీఐపీలో పెడుతున్నాం’ అన్నారని ఆయన వాపోయారు. జీసీసీలలో పనిగంటలపై కూడా కొంతమంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లైండ్‌, రెడిట్‌ రివ్యూలలో కొంతమంది.. జీసీసీలలో 12-15 గంటల పని ఉంటుందని చెబుతున్నారు. ‘‘మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్‌ అయితే సాయంత్రం ఆరు గంటల వరకూ మామూలుగానే ఉంటుంది. రాత్రి 7 గంటల తరువాత టార్చర్‌ మొదలవుతుంది. యూఎస్‌ నుంచి మేనేజర్లు లాగిన్‌ అవుతారు. అప్పుడైనా పని ఓ అరగంట-గంటలో అయిపోతుందా అంటే కాదు.. రాత్రి 10-11 గంటల వరకూ మీటింగ్‌లని చావగొడతారు. ఫుడ్‌ ఉచితం, జిమ్‌ ఉచితం... సకల సౌకర్యాల వెనుక ఉండే చీకటి ఇది’’ అని ఒక ఉద్యోగి ఆవేదన వెలిబుచ్చారు. ఆరంకెల జీతాలు వచ్చినా.. జీవితమంతా ఆఫీసుపాలైపోతోందని వాపోయారు.


ఇవి కూడా చదవండి...
ఏఐ.. రెండో టీచర్‌!

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవిత్రవాణి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 05:00 AM