Share News

ఎల్‌నినో దెబ్బకు పొదుపు మంత్రం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:40 AM

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగు నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సంబంధించి..

ఎల్‌నినో దెబ్బకు పొదుపు మంత్రం
El Niño Telangana

  • హైదరాబాద్‌లో నీటి ఆదాకు కసరత్తు..

  • ఇళ్లలో నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలి

  • తాగునీరు ఇతర అవసరాలకొద్దు..

  • గృహ విద్యుత్తు ఆదా చేయండి..

  • ప్రజలకు సర్కారు సూచన

  • ఓసీ లేకపోతే నల్లా కనెక్షన్‌కు నో..

  • కొత్త బోర్‌వెల్స్‌కు అనుమతులు వద్దని స్పష్టీకరణ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగు నీటి పొదుపు, భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సంబంధించి.. ప్రతీ కుటుంబం నీటి వినియోగాన్ని 20 శాతం మేర తగ్గించుకోవాలని సూచించింది. తాగు నీటిని దుర్వినియోగం చేయవద్దని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని తెలిపింది. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ పరిశ్రమలకు చేసే నీటి సరఫరాలో కోతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) లేకుండా క్యూర్‌ పరిధిలో కొత్త నల్లా కనెక్షన్‌ ఇవ్వకూడదంటూ నిబంధనలను కఠినతరం చేసింది.


హైదరాబాద్‌ తాగునీటి వనరులుగా ఉన్న నాగార్జున్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌, సింగూరు జలాశయాలు ఈ సమయంలో నిండుకుండల్లా ఉండాలి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉన్నాయి. సింగూరు, మంజీరా జలాశయాల్లోని నీళ్లు డిసెంబరు వరకు మాత్రమే సరిపోనున్నాయి. హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌లా మారడంతో గతేడాదితో పోల్చితే భూగర్భ జలాలు 5 మీటర్ల దిగువకు చేరాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఎల్‌నినో ముందస్తు చర్యలపై శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ప్రతీ కుటుంబం రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు.


జలమండలి పైపులైన్లకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని తోడుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, నీటి దోపిడీని అడ్డుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు పడిపోయిన నేపథ్యంలో కొత్త బోర్‌వెల్స్‌కు అనుమతులు ఇవ్వవద్దని హైదరాబాద్‌ కలెక్టర్‌ ప్రియాంక ఆలా ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. నీటితోపాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వాడుకోవాలని టీజీఎస్పీడీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్‌, సెంట్రల్‌ మీడియన్ల నిర్వహణ వంటి పనులకు తాగునీటిని వినియోగించరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ. కర్ణన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఇక, నీటి పొదుపు చర్యల్లో భాగంగా ఓసీ లేకపోతే కొత్త నల్లా కనెక్షన్‌ ఇవ్వకూడదని వాటర్‌ బోర్డు నిర్ణయించింది. సాధారణంగా నల్లా కనెక్షన్‌ పొందడానికి భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తును జత చేస్తే వాటర్‌బోర్డు అనుమతులిస్తుంది. ఆ తర్వాత ఓసీ పొందుపరిస్తే నీటి బిల్లులిస్తారు. ఓసీ ఇవ్వకపోతే మూడింతలు అదనపు చార్జీలు వసూలు చేస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటర్‌బోర్డు ఈ నిబంధనలను సవరించింది. ఓసీ ఉంటేనే కొత్త నల్లా కనెక్షన్‌, డ్రైనేజీ కనెక్షన్‌ మంజూరు చేస్తామని ప్రకటించింది.


అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినా నల్లా కనెక్షన్‌ ఇవ్వకూడదని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించి కనెక్షన్‌ మంజూరు చేసిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పలు పరిశ్రమలకు సరఫరా చేసే నీటిని పది శాతం తగ్గించేందుకు వాటర్‌ బోర్డు చర్యలు తీసుకుంటుంది. తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్న నీటిని ఇతర అవసరాలకు వాడొద్దని కూడా వాటర్‌ బోర్డు అధికారులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

లేని గర్భిణులను ఎలా తేవాలి?

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 04:40 AM