సైబర్ వల.. చిక్కితే విలవిల!
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:27 AM
నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లు, పార్ట్‌టైమ్ కొలువులంటూ సైబర్ నేరగాళ్లు చేస్తోన్న మోసాలపై పోలీసులు, పత్రికలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అత్యాశకు పోతున్న చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ను పోలిన యాప్‌తో రిటైర్డు బ్యాంకు మేనేజర్‌కు రూ.98.82 లక్షల టోకరా
టాస్క్‌ల పేరిట ఐటీ ఉద్యోగినికి
రూ.9.76 లక్షలకు బురిడీ
న్యూడ్ వీడియోలతో బెదిరింపులు
రూ.9.48 లక్షలు చెల్లించిన యువకుడు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లు, పార్ట్‌టైమ్ కొలువులంటూ సైబర్ నేరగాళ్లు చేస్తోన్న మోసాలపై పోలీసులు, పత్రికలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అత్యాశకు పోతున్న చాలా మంది సైబర్ కేటుగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఓ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్‌తో నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.98.82 లక్షలు కొట్టేశారు. టాస్క్‌ల పేరిట జరిగిన మోసంలో ఓ ఐటీ ఉద్యోగిని నుంచి రూ.9.76 లక్షలు కొట్టేశారు. మరో ఘటనలో డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతితో వీడియో కాల్ మాట్లాడిన ఓ యువకుడు.. న్యూడ్ వీడియోల పేరిట చేసిన బెదిరింపులకు భయపడి రూ.9.48లక్షలు సమర్పించుకున్నాడు. ఈ ఘటనలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి
మాజీ బ్యాంక్ మేనేజర్‌కు బురిడీ
హైదరాబాద్‌లోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్(65) జూలై 8న ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చూశారు. దాని ద్వారా హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ను పోలిన హెచ్‌ఎ్‌సఎల్ క్యాపిటల్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులో చేరాడు. ఆ గ్రూప్‌లో పరిచయమైన నిషా వర్మ అనే మహిళ సూచనలతో హెచ్‌ఎస్ఎల్ క్యాపిటల్ యాప్‌లో ఖాతాలు తెరిచి పెట్టుబడులు పెట్టారు. తొలుత రూ.20వేలు డిపాజిట్ చేయగా లాభాలు చూపించడంతో నమ్మిన మాజీ బ్యాంకు మేనేజర్ విడతల వారీగా డబ్బులు జమ చేశారు. ఆ తర్వాత తన కుమారుడి పేరు మీద కూడా ఖాతా తెరిచారు. షేర్లు, ఐపీఓలు, వడ్డీ లేని రుణాలు, ఆ రుణం సొమ్ముతో పెట్టుబడులు, విత్ డ్రా కోసం పన్నులు, ఈడీ చార్జీలు, ప్రొసెసింగ్ ఫీజులు అంటూ నిషా వర్మ బృందం సూచనల మేరకు రూ.98.82 లక్షలు బదిలీ చేశారు. చార్జీల మీద చార్జీలు వసూలు చేస్తుండడంతో ఆయన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో తనకు జరిగిన మోసాన్ని తెలుసుకొన్నాడు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టాస్కుల పేరుతో రూ.9.76 లక్షల టోకరా!
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగిని(30) వాట్సా్‌పకి మార్చి 3న ఓ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సంజన రాయ్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి తమ సంస్థకు చెందిన వ్యాపారుల ఆన్‌లైన్ విజిబిలిటీ పెంచే పనులు చేయాలని, ఒక్కో టాస్క్‌కు డబ్బులు చెల్లిస్తామని చెప్పాడు. తొలుత మూడు టాస్కులు పూర్తి చేసిన అనంతరం నాలుగో టాస్క్ కోసం మరో టెలిగ్రామ్ ఐడీని సంప్రదించాలని సూచించారు. తర్వాత ‘జాబ్స్ పార్ట్ టైమ్ ఎర్న్ ఆన్‌లైన్’ వెబ్‌సైట్‌లో ఖాతా తెరిపించారు.
అందులో ప్రీపెయిడ్ టాస్క్‌ల పేరుతో వల వేశారు. తొలుత రూ.1000 చెల్లించి ఓ టాస్క్ చేయగా ఆమె ఖాతాలో రూ.19000 క్రెడిట్ చేసి నమ్మించారు. ఆ తర్వాత రూ.50,000 టాస్క్ చేస్తే రూ.1.15 లక్షలు వస్తాయని, రూ.1.50 లక్షల టాస్క్ పూర్తి చేస్తే రూ.2.50 లక్షల వస్తాయని చెబితే ఆ మేరకు ఆమె డబ్బు చెల్లించింది. అనంతరం టాస్క్‌లో తప్పు జరిగిందని, కరెక్షన్ చార్జీలని వసూళ్లు చేశారు. ఇలా బాధితురాలు మొత్తం రూ.10,90,994లు బదిలీ చేయగా రూ.1,14,950లు మాత్రమే తిరిగి వచ్చింది. చివరకు యాప్‌లో రూ.31.33 లక్షల లాభం చూపించి, దాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.8.04 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆ యువతి మోసాన్ని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అర్ధనగ్న వీడియోతో బ్లాక్‌మెయిల్
హైదరాబాద్, గౌలిదొడ్డిలోని ఓ కో-లివింగ్ పీజీలో ఉంటున్న ఐటీ ఉద్యోగి(25) సెప్టెంబరు 23న ‘ఐస్‌ల్లే’ డేటింగ్ యాప్‌లో సృష్టి గుప్తా అనే యువతితో మాట్లాడటం ప్రారంభించాడు. సెప్టెంబరు 24న ఆమెతో వాట్సా్‌పలో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సదరు యువకుడు అర్ధనగ్నంగా(సెమీ న్యూడ్) ఉన్నప్పుడు వీడియో కాల్‌లోని అవతలి వ్యక్తి వీడియో రికార్డు చేశారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాము అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. దీంతో ఆ యువకుడు తనతోపాటు తన తల్లి, స్నేహితుడి బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు విడతల వారీగా రూ.9.48 లక్షలు చెల్లించాడు. ఆపై, బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడికి విస్తృత అవకాశాలు
ధరణి ముసుగులో రికార్డులు తారుమారు
Read Latest Telangana News And Telugu News