Share News

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..

ABN , Publish Date - May 02 , 2026 | 02:55 PM

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..
DCP Aravind Babu

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టాలంటూ నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నందున ఇలాంటి ప్రచారాలు జోరందుకున్నాయని తెలిపారు. అమాయకులను టార్గెట్ చేసి నిండా ముంచుతున్నారని చెప్పుకొచ్చారు.


అలాంటి నేరగాళ్ల ఆట కట్టించేందుకే సైబర్ పెట్రోలింగ్ కార్యక్రమం చేపట్టినట్లు డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసే 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకూ గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. 1,903 పెయిడ్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్లను గుర్తించి తొలగించినట్లు అరవింద్ బాబు చెప్పుకొచ్చారు. వీటిని ఎక్కడి నుంచి, ఎవరు ఆపరేట్ చేస్తున్నారనే దానిపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. యూజర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎంత మంది ఆపరేట్ చేస్తున్నారనే దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. దీని వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై కూపీ లాగుతున్నట్లు పేర్కొన్నారు. మోసపోయిన బాధితులు ఇప్పటివరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని డీసీపీ చెప్పుకొచ్చారు. నిందితులని గుర్తించే పనిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.


గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెడితే మొదట్లో లాభాలు వస్తాయని, ఆ తర్వాత నష్టాలు వస్తాయని డీసీపీ తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా నిందితులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఐపీఎల్ సీజన్ వేళ పెట్టుబడి పెట్టాలంటూ సోషల్ మీడియాలో నేరగాళ్లు ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ వీటిపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పూర్తి నిషేధం ఉందని.. కేటుగాళ్ల మాయలో పడొద్దని యువతకు డీసీపీ అరవింద్ బాబు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం.. వచ్చాం: కవిత

వంట నూనెల ధరలు సలసల


Updated Date - May 02 , 2026 | 04:10 PM