Share News

యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చు: ఇరాన్

ABN , Publish Date - May 02 , 2026 | 02:51 PM

యుద్ధం మళ్లీ మొదలు కావచ్చని ఇరాన్ సైనికాధికారి ఒకరు హెచ్చరిక చేశారు. గతంలో తమతో ఏకాభిప్రాయానికి వచ్చిన యూఎస్ మళ్లీ కట్టుతప్పుతున్న దాఖలాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

యుద్ధం మళ్లీ మొదలు కావొచ్చు: ఇరాన్
War With US Will Likely Resume, Says Iran

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధం దాదాపు ముగిసినట్టే అని అమెరికా పదే పదే చెబుతున్న వేళ ఇరాన్ సైనిక అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని సైనిక ప్రధాన కార్యాలయం అధికారి మొహమ్మద్ జాఫర్ అసదీ తాజాగా హెచ్చరించారు. ఈ మేరకు ఇరాన్ వార్తా సంస్థ కీలక కథనాన్ని ప్రచురించింది. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన దౌత్యపరమైన ఏకాభిప్రాయాన్ని అమెరికా ఉల్లంఘిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే, ఇరాన్ దళాలు మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. తమను రెచ్చగొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, యుద్ధం ముగింపు దిశగా ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. డీల్‌కు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ తాము అంగీకరించలేని మినహాయింపులను కోరుతోందని అన్నారు. ఇరాన్ నాయకత్వంలో చీలికలు ఏర్పడ్డాయని, రెండు మూడు గ్రూపులుగా నాయకత్వం విడిపోయిందని చెప్పారు.


ప్రస్తుత కాల్పుల విరమణ కారణంగా యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక యుద్ధం మొదలు పెట్టాక 60 రోజుల్లోపు అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌ (చట్టసభలు) అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలన్న 1973 నాటి వార్ పవర్స్ తీర్మానం కూడా రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్ అంటున్నారు. సర్వసైన్యాధిపతి అయిన అధ్యక్షుడి అధికారాలకు ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా పరిమితులు విధిస్తోందని చెబుతున్నారు. గత అధ్యక్షులు అనేక సార్లు ఈ తీర్మానాన్ని పక్కనపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

వార్ పవర్స్ తీర్మానం ప్రకారం, ప్రత్యర్థులపై యుద్ధం ప్రారంభించాక 48 గంటల్లో అమెరికా అధ్యక్షుడు ఈ విషయాలను కాంగ్రెస్‌కు తెలియజేయాలి. ఆ తరువాత యుద్ధాన్ని కొనసాగించేందుకు 60 రోజుల్లోపు కాంగ్రెస్ అనుమతి పొందలేని పక్షంలో దాడులను ఆపేయాలి.

Updated Date - May 02 , 2026 | 03:01 PM