పాన్‌మసాలా అక్రమ తయారీ కేంద్రంపై సీజీఎస్టీ దాడులు.. రూ.76 లక్షల సరుకు సీజ్
ABN , Publish Date - Aug 25 , 2026 | 07:13 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అక్రమ పాన్‌మసాలా, పొగాకు తయారీ కేంద్రం గుట్టును సెంట్రల్ జీఎస్టీ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఓ షెడ్‌లో రహస్యంగా వీటిని అక్రమంగా తయారీ చేస్తున్నట్లు వారికి సమాచారం అందింది.
హైదరాబాద్, ఆగస్టు 25: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అక్రమ పాన్‌మసాలా, పొగాకు తయారీ కేంద్రం గుట్టును సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో ఓ షెడ్‌లో రహస్యంగా వీటిని అక్రమంగా తయారీ చేస్తున్నట్లు వారికి సమాచారం అందింది. ఈ సందర్భంగా కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది.
ఆగస్టు 20వ తేదీన ఈ కేంద్రంపై సీజీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 5,500 కిలోల ప్యాక్ చేసిన పాన్ మసాలా, పొగాకు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 76 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. ఈ దాడుల్లో 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమంతోపాటు 810 కిలోల పొగాకు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 40 ఎఫ్‌ఎఫ్‌ఎస్ ప్యాకింగ్ యంత్రాలను సీజ్ చేశారు.
ఈ కేంద్రంలో 56 మంది కార్మికుల పని చేస్తున్నట్లు గుర్తించారు. పలు బ్రాండ్లతో పాటు పేరు లేని పాన్ మసాలా, జర్దాను తయారీ చేస్తున్నట్లు సీజీఎస్టీ అధికారులు కనుగొన్నారు. ఈ అక్రమ ఉత్పత్తుల రవాణాకు వినియోగిస్తున్న రెండు వాహనాలు సీజ్ చేశారు. భారీగా ప్యాకింగ్ మెటీరియల్‌తోపాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక జీఎస్‌టీ, హెచ్‌ఎస్‌ఎన్‌ఎస్ సెస్, కేంద్ర ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా ఈ ఉత్పత్తుల విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఆ క్రమంలో ఇప్పటి వరకు పన్ను, సెస్ ఎగవేత విలువ సుమారు రూ.160 కోట్లుగా గుర్తించామని వివరించారు. యంత్రాల సంఖ్య, సామర్థ్యం, నిల్వలు, సిబ్బంది వివరాల ఆధారంగా పన్ను ఎగవేత అంచనా వేసినట్లు సీజీఎస్టీ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండానే ఈ పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులను నిందితులు తయారీ చేస్తున్నారని సీజీఎస్టీ అధికారులు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News