Share News

బోనాలు శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యం: నగర సీపీ

ABN , Publish Date - Jul 14 , 2026 | 07:08 PM

ఆషాడ బోనాలు.. మొదటి 15 రోజులు అత్యంత కీలకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బంజారా హిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆషాడ బోనాలపై ఆ శాఖ అధికారులతో నగర సీపీ సమీక్ష నిర్వహించారు.

బోనాలు శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యం: నగర సీపీ
Hyderabad CP VC Sajjanar

హైదరాబాద్, జులై 14: ఆషాడ బోనాల ఉత్సవాలు శాంతియుతంగా, వైభవంగా నిర్వహించడమే లక్ష్యమని హైదరాబాద్ నగర్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ బోనాలు.. మొదటి 15 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం బంజారా హిల్స్‌లోని టీజీఐసీసీసీలో ఆషాడ బోనాలపై ఆ శాఖ అధికారులతో నగర సీపీ సమీక్ష నిర్వహించారు. ఈ బోనాలకు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.


జూలై 16 నుంచి ఆగస్టు13వ తేదీ వరకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గోల్కొండ, బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్, రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ భారీగా మోహరిస్తున్నట్లు వివరించారు.


భక్తులకు సమాచారం కోసం ఆలయాల వద్ద పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వివరించారు. మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని.. అందుకోసం షీ టీమ్స్‌తో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబుదొంగలపై ఉక్కుపాదం మోపనున్నట్లు చెప్పారు.


గత బోనాల్లో 644 మంది ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఆయన గుర్తు చేశారు. బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని నగర సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా

నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన

For More TG News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 07:25 PM