మత్స్యకారుల కన్నీళ్లపై జగన్ రాజకీయాలు మానుకోవాలి: పల్లా
ABN , Publish Date - Jul 14 , 2026 | 06:36 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో చనిపోయిన మత్య్సకారులలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని మాజీ సీఎం జగన్‌ను ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మత్య్సశాఖ నిధులను జగన్ దారి మళ్లించారని గుర్తు చేశారు.
విశాఖపట్నం, జులై 14: మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు మానుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లో గల్లంతైన మత్య్సకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించామని వివరించారు. మంగళవారం విశాఖపట్నంలో ఎమ్మెల్యే రామకృష్ణ బాబుతోపాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు పట్టాభిరామ్‌తో కలిసి పల్లా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. సముద్రంలో గల్లంతు అయిన మత్య్సకారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చనిపోయిన మత్య్సకారులలో ఎంత మందికి పరిహారం ఇచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌ను గాజువాక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మత్య్సశాఖ నిధులను జగన్ దారి మళ్లించారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో చనిపోయిన సుమారు 63 మంది మత్య్సకారుల కుటుంబాలకు కూటమి సర్కారు పరిహారం అందించిందని వివరించారు. వైఎస్ జగన్ మానవత్వం కోసం మాట్లాడుతుంటే విడ్డురంగా ఉందని వ్యంగ్యంగా అన్నారు. బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జగన్.. తాను ఎంత పరిహారం ఇస్తానని ప్రకటించలేదని తెలిపారు.
బోటు ప్రమాద విషయంలో రాజకీయం చేశారని వైసీపీ నాయకుడుపై పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. పడవ ప్రమాదంపై వైసీపీ నేతకు సమాచారం తెలిసిన ప్రభుత్వానికి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు వైఎస్ జగన్‌కు మత్య్సకారులే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మత్స్యకారులను వైఎస్ జగన్ ట్రాప్ చేస్తున్నారని.. ఈ విషయాన్ని గమనించాలంటూ వారికి విజ్ఞప్తి చేశారు. బాధిత మత్య్సకారుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన చిన్నకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
జగన్.. శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని ఏపీ టీడీపీ చీఫ్ విమర్శించారు. వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అతివేగంగా బైక్ నడిపి ఒకరి మరణానికి కారణం అయ్యాడని విమర్శించారు. అది తప్పు కాదని జగన్ సమర్థిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలంటూ జగన్‌కు ఆయన హితవు పలికారు. గతంలో వైఎస్ జగన్ వాహనం కింద పడి ఓ వ్యక్తి చనిపోయారని.. ఆ మృతదేహాన్ని పక్కన పెట్టి వెళ్లిపోయారని గుర్తు చేశారు. బాధ్యత గల వ్యక్తిగా జగన్ వ్యవహరించాలని ఆకాంక్షించారు.
బాధిత మత్స్యకార కుటుంబాలకు కోటి రూపాయిల పరిహారం ఇస్తామని జగన్ మాయమాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా మత్య్సశాఖ మంత్రి.. బాధిత కుటుంబాల వద్దకు వెళ్లలేక పోయారని వివరించారు. ప్రమాదం జరిగిన10 రోజులు తర్వాత జగన్ పరామర్శకు వచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్య్సకార గ్రామం జాలరిపేటలో టీడీఆర్ కొట్టేయలని చూశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దురాగతాలు ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు.
జగన్ ముసలి కన్నీరు: ఎమ్మెల్యే రామకృష్ణ బాబు
మత్య్సకారుల కుటుంబాలను పరామర్శించి ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన మత్య్సకారులకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వని జగన్.. ప్రస్తుతం రూ. కోటి ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 50 శాతం సబ్సిడీతో మత్య్సకారులకు ఒక్క వల అయినా ఇచ్చారా? అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు పక్క జిల్లాలో ఉన్న జగన్ విశాఖపట్నంలో పరామర్శకు రాలేదని గుర్తు చేశారు. వేట నిషేధ సమయంలో వైఎస్ జగన్ రూ.10 వేలు ఇస్తే కూటమి ప్రభుత్వంలో రూ.20 వేలు అందిస్తున్నామని వివరించారు. మత్య్సకారులకు జగన్ చేసింది ఏమి లేదని టీడీపీ ఎమ్మెల్యే కుండబద్ధలు కొట్టారు.
వైసీపీ నేత నిర్లక్ష్యం కారణంగానే.. : విశాఖ జిల్లా టీడీపీ చీఫ్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను మత్య్సకారులు నమ్మరని విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షులు పట్టాభి రామ్ తెలిపారు. వైసీపీ నేత నిర్లక్ష్యం కారణంగానే సముద్రంలో గల్లంతయిన మత్య్సకారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పలాసలో వైసీపీ నేత, మాజీ మంత్రి కుమారుడు అతివేగంగా బైక్ నడిపి ఒకరి మృతికి కారణం అయ్యారని విమర్శించారు.
ఈ సంఘటన డైవర్ట్ చేయడానికి ఆయన విశాఖపట్నం పర్యటనకు వచ్చారని ఈ సందర్భంగా జగన్ వైఖరిని ఎండగట్టారు. మానవత్వం కోసం వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా అన్నారు. సొంత తల్లికి, చెల్లికి న్యాయం చెయలేని ఆయన మహిళలకు ఏం న్యాయం చేస్తారని జగన్ తీరును విశాఖ జిల్లా టీడీపీ చీఫ్ ఎండగట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమలాపురంలో రైతుల ఆందోళన.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన
For More AP News And Telugu News