Share News

దొరికిపోతాననే భయంతో చంపేశాడు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:18 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసు నిందితుణ్ని 24 గంటల్లో అరెస్టు చేసి కోర్టుల హాజరుపరిచామని మల్కాజిగిరీ సీపీ సుమతి తెలిపారు.

దొరికిపోతాననే భయంతో చంపేశాడు
Malkajgiri Police

  • బొల్లారంలో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు..

  • 24 గంటల్లో నిందితుడి అరెస్టు.. రిమాండు

  • ఏడుస్తూ, చేతులతో కొడుతుండడంతో అతడు పాపను హత్య చేశాడు

  • వెల్లడించిన మల్కాజిగిరి సీపీ సుమతి

  • పనివాళ్ల వివరాలు పోలీసులతో ధ్రువీకరించుకోవాలని సూచన

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసు నిందితుణ్ని 24 గంటల్లో అరెస్టు చేసి కోర్టుల హాజరుపరిచామని మల్కాజిగిరీ సీపీ సుమతి తెలిపారు. హైదరాబాద్‌లోని బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో.. కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న రిసెర్చ్‌ సైంటిస్ట్‌ మిల్టర్‌ ఫెర్నాండజ్‌ మోసెస్‌ (44) కుమార్తె ఆరెలియా (5) అలియాస్‌ మోనును నిందితుడు చీకటిగా ఉన్న సెల్లార్‌లోకి తీసుకెళ్లాడని, పాప భయంతో ఏడుస్తూ, చేతులతో నిందితుడి ముఖంపై కొట్టడం ప్రారంభించడంతో ఆమెను సముదాయించలేక, దొరికిపోతాననే భయంతో చంపేశాడని వివరించారు. సెల్లార్‌లో దొరికిన తాళ్లతో పాప కాళ్లు, చేతులు కట్టేసి, గొంతుకు ఉరిబిగించి హత్య చేశాడని.. తర్వాత అక్కడే పడి ఉన్న ఒక రాయిని పాప వీపునకు కట్టి పాడుబడ్డ నీళ్ల సంపులో పడేసి ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయాడని చెప్పారు.


పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతరం.. ఎస్‌వోటీ, క్రైమ్స్‌, ఎస్‌బీ, టెక్నికల్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు కలిసి 10 బృందాలుగా ఏర్పడి సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారని సీపీ తెలిపారు. కిడ్నాపర్‌ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు. వందలాది, సీసీ పుటేజీలు, పరిశీలించిన పోలీసులు బాలిక గేటెడ్‌ కమ్యూనిటీ నుంచి బయటకు రాలేదని గుర్తించామని.. వెంటనే గేటెడ్‌ కమ్యూనిటీలోని అణువణువు గాలించగా.. క్లబ్‌హౌస్‌ సెల్లార్‌లోని నీటిగుంతలో బాలిక మృతదేహం కనిపించిందని చెప్పారు. వెంటనే టెక్నికల్‌, ఫోరెన్సిక్‌ బృందాలు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించాయని.. పోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని సీపీ తెలిపారు.


రెండువారాలకే పనిమానేసి..

బీహార్‌ నలంద జిల్లాకు చెందిన విక్రమ్‌ కుమార్‌ కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 6 వరకూ (రెండు వారాలపాటు) సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆ గేటెడ్‌ కమ్యూనిటీలో చురుగ్గా తిరిగే చిన్నారి ఆరేలియాపై అతడి కన్ను పడింది. పాపను కిడ్నాప్‌ చేసి, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయాలని విక్రమ్‌ పథకం వేశాడు. పథకంలో భాగంగా ఈనెల 10న గేటెడ్‌ కమ్యూనిటీలో దసరా సందర్భంగా జరుగుతున్న పనులు చేసేందుకు వచ్చానంటూ గేటు వద్ద సెక్యూరిటీకి చెప్పి సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో లోపలికి వచ్చాడు. అక్కడ అతడికి ఆరేలియా కనిపించింది. ఆమెను మాటలతో మభ్యపెట్టి సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు. ఆమెతో మంచిగా మాట్లాడి ఆమె తండ్రి, తాత ఫోన్‌ నంబర్‌ తెలుసుకున్నాడు. గతంలో అతడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఉండడంతో పాప అతణ్ని నమ్మి, అమాయకంగా వారి నంబర్లు ఇచ్చింది. అయితే, సెల్లార్‌లో చీకటిగా ఉండటం, అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో భయపడి ఏడవడం మొదలుపెట్టింది.


అడ్డుకున్న విక్రమ్‌ ముఖంపై కొడుతూ ఏడుస్తుండడంతో అతడు ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తర్వాత, ఏమీ తెలియనట్లు అక్కణ్నుంచీ బయటకెళ్లిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత.. పాప తాతకు ఫోన్‌ చేసి, ఆమెను కిడ్నాప్‌ చేశానని, రూ.20లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. డబ్బులు ఇస్తామని, పాపను చూపించాలని కోరినా చూపించలేదు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసుల తెల్లవారుజామున 4 గంటలకు సంపులో పాప మృతదేహాన్ని గుర్తించారు. అందరూ గుండెలుపగిలేలా రోదిస్తున్న సమయంలో విక్రమ్‌ మరోసారి ఫోన్‌చేసి.. ‘‘డబ్బులు ఇస్తారా? పాపను చంపేయాలా?’’ అంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌కాల్‌ ఆధారంగా సాంకేతికతను వాడి నిందితుడు యూస్‌ఫగూడలో ఉన్నట్టు గుర్తించి ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.


పనివారితో భద్రం: సీపీ సుమతి

గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసించేవారు తమ వద్ద పనిచేస్తన్న సిబ్బంది, సెక్యూరిటీ, వాచ్‌మెన్‌లు, ఇంటి పనివారి వివరాలు తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని మల్కాజిగిరి సీపీ సుమతి సూచించారు. దీని కోసం పోలీసులు అందించే ‘‘మీ సురక్ష- డొమెస్టిక్‌ హెల్పర్స్‌ వెరిఫికేషన్‌’’ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గేటెడ్‌ కమ్యూనిటీ పూర్తిగా కవర్‌ అయ్యేలా అత్యాధునిక సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, పోలీసులతో అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, నివాసితులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉపాధి కోసం వెళ్లి..మృత్యువుతో పోరాటం

రోగుల భద్రతకు భరోసా!

నిరుద్యోగ నిధుల భక్షణ?

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:57 AM