Share News

హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్టు

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:59 AM

హైదరాబాద్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇందుకు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ ఆనంద్‌(23)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్టు
Cine Director Son Arrested

  • హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడి అరెస్టు

  • పాదచారుడిని ఢీకొట్టిన ఇన్నోవా కారు

  • గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చేందుకు

  • రోడ్డు దాటిస్తుండగా వారిని ఢీకొట్టిన

  • మరో రెండు కార్లు

  • ఒకరి మృతి, ఇన్నోవా డ్రైవర్‌కు గాయాలు

  • సందీప్‌ ఆనంద్‌ సహా మరొకరి అరెస్టు

రాయదుర్గం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇందుకు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రముఖ సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ ఆనంద్‌(23)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇదే కేసులో శార్య అనే మరో వ్యక్తి కూడా అరెస్టయ్యాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం... సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఖాజాగూడ అంకుర ఆస్పత్రి ఎదురుగా.. ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న బిహార్‌కు చెందిన నందకిషోర్‌ కుమార్‌రే(31)ను ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నంద కిషోర్‌ కుమార్‌రేను ఎదురుగా ఉన్న అంకుర ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇన్నోవా కారు డ్రైవర్‌ జైద్‌షా కద్రీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారు రహదారి దాటుతుండగా.. నానక్‌రామ్‌ గూడ ఓఆర్‌ఆర్‌ రోటరీ వైపు అతివేగంతో వెళుతున్న మహీంద్రా కారుతోపాటు మరో కారు వారిని ఢీకొట్టాయి. మహీంద్రా కారు ఆగకుండా వెళ్లిపోయింది. అయితే, ప్రమాదంలో నందకిషోర్‌ కుమార్‌రే అక్కడికక్కడే మరణించగా.. జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన మహీంద్రా వాహనాన్ని గుర్తించారు. ప్రమాద సమయంలో కారు నడిపిన ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ ఆనంద్‌ను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. ఫిలింనగర్‌లోని తమ కార్యాలయం నుంచి నానక్‌రామ్‌గూడలోని నివాసానికి కారులో బయలుదేరిన సందీప్‌ ఆనంద్‌ మార్గమధ్యలో పాదచారులను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, నందకిషోర్‌ కుమార్‌రే, కద్రీలను ఢీకొట్టిన మరో కారు డ్రైవర్‌ శౌర్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, సందీప్‌ ఆనంద్‌ గతంలో నార్కోటిక్‌ పరీక్షల్లో పట్టుబడి అవగాహన తరగతులకు కూడా హాజరయ్యాడని.. సోమవారం నాటి ప్రమాదం అనంతరం నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌ అని ఫలితం వచ్చిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కొండా సురేఖ అంశంపై ఎటువంటి ఆదేశాలు లేవు

ఆ చోరీ ఇంటిదొంగల పనే?

Updated Date - Sep 02 , 2026 | 06:00 AM